Atchennaidu On Cm Jagan
Atchennaidu On CM Jagan : ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి జనంపై మోయలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులపై భారం మోపనని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టిక్కెట్ పై రూ.10 పెంచిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? అని ఆయన అడిగారు.
డీజిల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయని, ఏపీలో మాత్రం పెరుగుతోందన్నారు. డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ వాడుతున్న డీజిల్ పై పన్నులు వెనక్కి తీసుకుని ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు. పాలన చేతకాకపోతే సీఎం జగన్ దిగిపోవాలన్నారు.
”24 గంటలూ కరెంటు ఇవ్వనప్పుడు ఛార్జీలు ఎలా పెంచుతారు? వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడే రాష్ట్రానికి ఇబ్బంది వదులుతుంది. మద్యపానాన్ని తొలగిస్తామని చెప్పి సొంత బ్రాండ్ల తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
మద్యంపై రూ.12వేల కోట్లు దోచుకున్నారు. కరెంటు రేట్లు విపరీతంగా పెంచారు. దేశ చరిత్రలో ఇన్ని దొంగ పన్నులు ఎప్పుడూ చూడలేదు. న్యాయ వ్యవస్ధను కూడా విమర్శిస్తున్నారు” అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు నేరస్తులుగా ఉన్న కేసులకు సంబంధించిన సాక్ష్యాలను తెచ్చి కాల్చారంటే చాలా దారుణం అన్నారు.