Andhra Pradesh
Andhra Pradesh : తిమింగలం వాంతి గురించి వినే ఉంటారు. దాని వాంతి మార్కెట్లో కోట్లలో ధర పలుకుతుందని అనేది బహిరంగ విషయమే. ఇది దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. చాలా మంది జాలర్లు తమకు తిమింగలం వాంతి దొరకాలని దేవుడిని పూజిస్తారు. ఇది దొరికితే కోటీశ్వరులు కావచ్చని వారి ఆశ. దీనిని కొనేందుకు చాలామంది ఎగబడతారు. దీని అమ్మకం కొనుగోళ్లు ఎక్కువగా ఆన్ లైన్ ద్వారానే జరుగుతాయి. దీనిని ఖరీదైన పెర్ఫ్యూమ్ ల తయారీలో వాడుతారు. అంబర్ గ్రిస్ గా పిలవబడే తిమింగలం వాంతి కేజీ కోటి రూపాయలకు పైనే ఉంటుంది.
అందుకే దీనిని ఫ్లోటింగ్ గోల్డ్ (సముద్రంపై తేలియాడే బంగారం) లేదా ట్రెజర్ ఆఫ్ ది సీ (సముద్ర నిధి నిక్షేపం) అని కూడా పిలుస్తారు. కొన్ని దేశాల్లో ఐతే అంబర్ గ్రిస్ లభించిన మత్యకారులు ఆన్ లైన్ వేలం ద్వారా దీనిని భారీ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కానీ భారత్ లో తిమింగలం వాంతి అమ్మడం కొనడం నిషేధం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వేటగాళ్ల బారినుంచి జంతువులను రక్షించేందుకు భారత్ 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకొచ్చింది.
ఇక ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు తమకు వద్ద ఉన్న తిమింగలం వాంతిని (అంబర్ గ్రిస్) విక్రయించేందుకు ఆన్‌లైన్ పెట్టారు. ఇది చెన్నై వన్యప్రాణుల నేర నియంత్రణ విభాగం అధికారుల కంటపడింది. దీంతో వారు అంబర్ గ్రిస్ కొంటామని సంప్రదించి 8 మంది సభ్యలు గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8.25 కేజీల బరువైన అంబర్ గ్రిస్ ను స్వాధీనం చేసుకున్నారు.
దీని మార్కెట్ విలువ రూ. 12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిని విక్రయించడం నేరం కావడంతో వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చేసు నమోదు చేశారు .. వీరి నుంచి 8 మొబైల్స్, 6 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. 8 మంది ముద్దాయిలను నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి 13 రోజులు రిమాండ్ విధించారు.తదుపరి వారిని నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు.