AP Crime : ఏపీలో దారుణ ఘటన.. బిక్షాటన చేస్తున్న బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి..
AP Crime : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలో బిక్షాటన చేస్తున్న బాలికను ఆటో డ్రైవర్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది.
- Harish Thanniru
- Updated on- July 31, 2026 / 12:01 PM IST
Auto Driver Kills Beggar Girl in Andhra Pradesh
AP Crime : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలో బిక్షాటన చేస్తున్న బాలికను హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. బిక్షాటన చేస్తున్న బాలికను ఓ ఆటోడ్రైవర్ చేరదీసి లోబర్చుకున్నాడు. అయితే, ఆ బాలిక పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి.. రైలులో ఒడిశాలోని రాయగడ ప్రాంతకు తీసుకెళ్లి అక్కడ పడేశాడు. గుర్తుతెలియని మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షం.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ కు చెందిన బొలిశెట్టి సురేశ్ అనే ఆటోడ్రైవర్ ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భిణీ. అయితే, కొన్ని నెలల కిందట బిక్షాటన చేసుకునే ఓ బాలికతో సురేష్‌కు పరిచయమైంది. తనకు ఎవరూ లేరని బాలిక చెప్పడంతో గర్భిణీగా ఉన్న తన భార్యకు సహాయంగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, కొద్దిరోజులకే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నెలలో సురేష్ కు పాప పుట్టింది. అప్పటి నుంచి తనను పెండ్లి చేసుకోవాలని బాలిక ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది.
తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఇంట్లో విషయం చెబుతానని బాలిక సురేష్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అంతేకాదు.. ఈనెల 15న బాలిక నేరుగా సురేష్ ఇంటికి వచ్చి మరోసారి వాగ్వాదానికి దిగగా, ఆగ్రహంతో సురేష్ ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో కుక్కి.. జ్ఞానాపురం రైల్వేస్టేషన్ లో రైలు ఎక్కాడు. అదేరోజు సాయంత్రం 6.30గంటలకు ఒడిశా రాష్ట్రం రాయగడకు చేరుకున్నాడు. అక్కడ చాందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్‌ను పడేశాడు. మళ్లీ రైలెక్కి అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
మూడురోజుల తరువాత గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల సమాచారంతో చాందిలి పోలీసులు ఘటన స్థలికివెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. మృతదేహం ఎక్కడిది.. ఇక్కడ ఎవరు పడేశారు.. అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మృతదేహం పడిఉన్న ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డ్స్ వంటి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. దీంతో హంతకుడు సురేష్ అని గుర్తించారు. గురువారం ఒడిశా పోలీసులు, విశాఖ వచ్చి కంచరపాలెం పోలీసులు సహకారంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని చాందిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
