Nara Lokesh
Auto Driver Service Nara Lokesh : ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ద్వారా ప్రతీయేటా రూ.15వేలు ఇవ్వనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌లతో కలిసి ప్రారంభించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం మెగాచెక్ రూ. 436 కోట్ల రూపాయలను లబ్దిదారులకు సీఎం చంద్రబాబు అందజేశారు.
ఈ పథకంలో భాగంగా తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర ఖాతాల్లో జమ చేశారు. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి చేకూరనుంది. అంతకుముందు ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్ నగర్ కు చంద్రబాబు, పవన్, మాధవ్, లోకేశ్ తదితరులు ఆటోలో వచ్చారు. ఆటో వాలాల ఖాకీ చొక్కాలను ధరించి సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి రాజకీయాల వరకు ఆటో డ్రైవర్లు చర్చిస్తారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలుకరిస్తారు. ఆటో వెనుక కొటేషన్లు చదువుతుంటా.. అవి చూస్తుంటే వారి మనసు ఏంటో అర్ధమవుతోందని లోకేశ్ అన్నారు. ఆటోలో ఏ వస్తువు మరిచిపోయినా పోలీసులకు ఇస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల ఛార్జీలు వేసి డ్రైవర్లపై భారం మోపారని లోకేశ్ విమర్శించారు.
యువగళం పాదయాత్రలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. గత ప్రభుత్వంలో కుడి చేత్తో 10వేలు పెట్టి.. ఎడమ చేత్తో రూ.20వేలు తీసుకున్నారు. నేను యువగళం పాదయాత్ర చేసే సమయంలో మహిళలను కించపరిచే విధంగా రోజా మాట్లాడారు. రోజాకు చీరా, జాకెట్ ఇచ్చేందుకు తెలుగు మహిళలు వెళితే ఆటో డ్రైవర్లను రోజా ఇబ్బందులు పెట్టారు. ఆ ఆటో డ్రైవర్ ఈ విషయం నా దృష్టికి తెచ్చినప్పుడు నేను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా. వెంటనే చంద్రబాబు స్పందించి కొత్త ఆటో ఇచ్చారని లోకేశ్ అన్నారు.
మహిళలను మనం గౌరవించాలి. ప్రజలను చైతన్యం చేసే శక్తి మీకుంది. ఆటోలో ఎక్కే వారిని గౌరవించాలి. మీ రుణం తీర్చుకోవడం మా లక్ష్యం. ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుంటాం. దేశంలో రాష్ట్రంలో డబులింజన్ సర్కార్ నడుస్తోందని నారా లోకేశ్ అన్నారు.