AP Politics: ఇక్కడ కూడా ఆ బ్రదర్స్‌ వెయిటింగేనా? రాజకీయ భవిష్యత్‌పై ఇద్దరు సోదరుల నిరీక్షణ

ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ జిల్లాలో ఫస్ట్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న కుటుంబం వారిది. అధినేత జగన్‌కు ఆప్తులుగా, అత్యంత ఆత్మీయులుగా ఆ అన్నదమ్ములు దగ్గరయ్యారు. అయితే కాలచక్రంలో బడానాయకుల రాకతో వారి ప్రాధాన్యత మసకబారింది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. అయినా దశాబ్దానికి పైగా పార్టీకి సేవలందించారు. తర్వాత ఆ బ్రదర్స్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ మొదలైంది. దీంతో చెరోదారి చూసుకున్నారు. కానీ.. ఇప్పుడు రెండు పార్టీల్లో ఉన్నా వాళ్లిద్దరూ ఒక్కటే అన్నట్లు తయారయ్యారు. ఇంతకీ ఎవరా బ్రదర్స్‌..? వాచ్‌ దిస్‌ స్టోరీ…

విజయనగరంలో జిల్లాలో ఈ అసెంబ్లీ వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కానీ అక్కడ పార్టీ మాత్రం బలంగానే ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో కేడర్‌ అయోమయం కారణంగా చాలామంది బయటకు వచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని తట్టుకోలేక చాలామంది వైసీపీ నేతలు రాంరాం చెప్పేశారు.

తమకు అండగా ఉంటారనుకున్న మాజీమంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్‌ చిన్న శ్రీను వంటి నేతలు కూడా విజయనగరం నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టే సాహసం చేయలేకపోయారు. తమ అనుచరులకు భరోసా ఇవ్వలేకపోవడంతో సీనియర్లయిన పిల్లా విజయకుమార్ వంటి నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.

వైసీపీని వీడి చెరోదారి
వైసీపీ స్థాపించిన మొదట్లో తొలి సభ్యత్వం తీసుకుని జిల్లాలో మొదటిసారి జెండా ఎగరేసిన వారిలో అవనాపు విక్రమ్‌, విజయ్‌ సోదరులు ఉండేవాళ్లు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో వాళ్లిద్దరూ వైసీపీని వీడి చెరోదారి చూసుకున్నారు. ఒకరు జనసేన, మరొకరు టీడీపీలో చేరిపోయారు.

అవనాపు ఫ్యామిలీతో పాటు పలువురు విజయనగరం నేతలు ఆ తర్వాత వైసీపీని వదిలారు. అవనాపు సూరిబాబు మరణంత తర్వాత మాజీమంత్రి పెన్మత్స సాంబశివరావు అడుగు జాడల్లో నడుస్తూ ఎమ్మెల్యే టికెట్‌కు ప్రయత్నించారు అవనాపు విక్రమ్‌, విజయ్‌.

అదే టైంలో కోలగట్ల కాంగ్రెస్‌ను వదిలి వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కడంతో అవనాపు బ్రదర్స్‌ అవమానంగా ఫీలయ్యారు. 2019లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌. దీంతో వైసీపీలో ఎంత పనిచేసినా తమకు గుర్తింపు లేదని.. కోలగట్ల కారణంగా తమను పక్కన పెడుతున్నారన్న భావన కలిగింది. మాజీమంత్రి బొత్సకు అనుచరుల్లా మసులుకున్నా.. మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు ఈ సోదరులకు కోలుకోలేని దెబ్బ వేశాయి.

కనీసం కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు కూడా వీరికి అవకాశం దక్కలేదు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ముందు ఇదే విషయాన్ని బోరున వెళ్లగక్కినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కోలగట్ల, అవనాపు బ్రదర్స్‌ మధ్య గ్యాప్‌ బాగా దూరమైంది. ఇలాను ఉంటే కుదరదని ఆ సోదరులు చెరోదారి వెతుక్కున్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు.

ఒకే గూటికింద పనిచేసే చాన్స్‌ మళ్లీ..
విక్రమ్‌ కుటుంబం జనసేన పార్టీకి దగ్గరైంది. విజయ్‌ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పడటంతో వీళ్లిద్దరూ ఒకే గూటికింద పనిచేసే చాన్స్‌ మళ్లీ వచ్చింది. 14 ఏళ్లు వైసీపీకి అండగా ఉంటూ.. ఆర్థికంగా కూడా సహాయ సహకారాలిచ్చిన తమను అధినేత జగన్‌ మోసం చేశారన్న భావనలో వీరిద్దరూ పార్టీలు మారినా.. ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారు.

జిల్లాలో మంచి పట్టున్న అవనాపు ఫ్యామిలీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగానే ఉంది. అయితే ప్రస్తుతం జనసేనలో కూడా వారికి ఇలాంటి ఆధిపత్య పోరే ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్ని, గురాన అయ్యలు వంటి నేతలు ముందు వరసలో ఉన్నారు. దీంతో అవనాపు విక్రమ్‌ దంపతులకు మరోసారి గడ్డుకాలం ఎదురైంది.

టీడీపీలో కొనసాగుతున్న అవనాపు విజయ్ కూడా ఎమ్మెల్యే అదితి గజపతిరాజును నమ్ముకొనే అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ లో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైన తమ రాజకీయ భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయని గంపెడాశాలతో ఉన్నారు. మొత్తానికి వేర్వేరు పార్టీలైనా.. ఇద్దరు సోదరులు ఒకే కూటమి గూటికి చేరుకోవడం కొంత రిలీఫ్‌. మరి భవిష్యత్ లో వీరికి ఎలాంటి చాన్స్‌లు వస్తాయో వెయిట్‌ అండ్‌ సీ..

Nagarjuna: పొలిటికల్‌గా నాగార్జున టార్గెట్‌ అయ్యారా?