bapatla police arrested women, theft case : ఏపీ తెలంగాణాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం బాపట్లలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్దనుంచి బంగారం,వెండి నగదు స్వాధీనం చేసుకున్నారు.
బాపట్ల లోని భీమావారి పాలెనికి చెందిన కారుమూరి శివరామ ప్రసాద్ గతనెల 29న కుటుంబ సభ్యులతో కలిసి ప్రకాశం జిల్లా చిన గంజాం మండలం కడవకుదురులో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లో బీరువా తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేస నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితులకోసం గాలింపు చేపట్టారు. ఘటనా స్ధలంలో లభించిన వేలిముద్రలు ఆధారంగా చోరీ చేసింది శీలం దుర్గగా గుర్తించారు. ఆమె స్వగ్రామం తెనాలి మండలం చిన్నరావూరు. అయితే ఆమె ప్రస్తుతం రేపల్లెలోని నేతాజి నగర్ లోనివాసం ఉంటోంది. చిత్తుకాగితాలు ఏరుకునేందుకు రేపల్లే బస్సులో బాపట్ల వచ్చి దొంగతనానికి పాల్పడింది.
అనంతరం అక్కడి నుంచి కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలోని బంధువుల ఇంటికివెళ్లి అక్కడ తల దాచుకుంది. విషయాన్నితెలుసుకున్నపోలీసులు అక్కడకు వెళ్లి దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ఆమెవద్ద నుంచి రూ.15.37 లక్షలు, 121 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలికి భర్త చనిపోవటంతో రెండో వివాహం చేసుకుంది. రెండో భర్తకూడా చావుబతుకుల్లో ఉండటంతో దొంగతనాలకు అలవాటు పడిందని పోలీసులు తెలిపారు. రెండో భర్త కూడా చనిపోవటంతో దొంగతనాలే వృత్తిగా చేసుకుని జీవిస్తోందని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని కీసర, ఘట్ కేసర్ వద్దకూడానిందితురాలు రెండు చోరీలు చేసిందని ఆయన వివరించారు. ఈ రెండు ప్రాంతాల్లో 60 గ్రాముల బంగారం, కేజీ వెండి వరకు చోరీ చేసిందని సంబంధిత పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.