Bapatla Politics : బీచ్ పెట్టిన చిచ్చు.. బాపట్ల టీడీపీలో హీటెక్కిన గ్రూప్ రాజకీయం..
Bapatla Politics : బాపట్లలో పట్టుకోసం అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారాయి. బాపట్ల సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేసిన కామెంట్స్‌తో రాజకీయం హీటెక్కింది.
- Harish Thanniru
- Updated on- September 1, 2026 / 10:38 PM IST
Bapatla Politics
Bapatla Politics : బాపట్ల టీడీపీలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వర్సెస్ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య ఏడాదికిపైగా ఆధిపత్య పోరు నడుస్తున్నా.. అదంతా అంతర్గత పోరులాగే ఉండేదట. కానీ, లేటెస్ట్‌గా బాపట్ల సూర్యలంక బీచ్ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేసిన కామెంట్స్‌తో రాజకీయం హీటెక్కింది.
Also Read : Bihar : నేపాల్ వరదల ఎఫెక్ట్.. బిహార్‌లో హైఅలర్ట్.. వరద నీటిలో దొరికిన చేపలు తినొద్దని హెచ్చరిక.. ఎందుకంటే?
బాపట్లలో పట్టు కోసం అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీ వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యే ఒక దారి..ఎంపీ మరో దారిలో వెళ్తూ..సూర్యలంక బీచ్‌లో అలల హోరుకు మించి పొలిటికల్ జోరు పెంచారట. అధికారంలో ఉన్నప్పుడు కలిసి పనిచేయాల్సింది పోయి..ఆధిపత్యం కోసం ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ తగ్గకపోవడంతో క్యాడర్ నలిగిపోయే పరిస్థితి ఉందంటున్నారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా విడిపోయారనే చర్చ నడుస్తోంది.
బాపట్ల సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేయాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించడంతో..ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందట. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నరేంద్రవర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేసినట్లు టాక్. దీంతో కొందరు రియల్టర్లు ఎంపీ కృష్ణప్రసాద్‌ను సంప్రదించారట. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు పీక్స్‌కు చేరుకున్నాయట. ఆ తర్వాత ఇసుక తవ్వకాల వ్యవహారంలోనూ ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచిందట. లిక్కర్ షాపుల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందట. ఒక్కో ఇష్యూపై గ్యాప్ పెరుగుతూ రావడంతో..బాపట్ల టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి గొడవ చేరుకుందట.
అయితే..సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో..బీచ్ టూరిజం అభివృద్ధి పనులు స్పీడందుకున్నాయి. ఎమ్మెల్యే నరేంద్రవర్మ సూర్యలంక బీచ్‌లో నిర్మాణాలను పరిశీలించాక.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పర్యాటకుల కోసం నిర్మిస్తున్న టాయిలెట్లు, రెస్ట్‌రూమ్స్‌ను తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి అధికారులను ఆదేశించినట్లు తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లోకల్, నాన్ లోకల్ అంశాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. తాను బాపట్లకు చెందిన లోకల్ వ్యక్తినని..ఎంపీ కృష్ణప్రసాద్ నాన్ లోకల్ అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు. దీంతో ఇప్పటికే నడుస్తున్న లోకల్,నాన్ లోకల్ రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది.
సూర్యలంక బీచ్ రిసార్ట్ హోటల్ యాజమాన్యానికి ఎంపీ కృష్ణప్రసాద్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం అనుమానంగా ఉందట. అందుకే ఎమ్మెల్యేనే రంగంలోకి దిగారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హోటల్ యాజమాన్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందే టూరిజం అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఒకవేళ హోటల్ యాజమాన్యానికి అక్కడి నిర్మాణాలపై అభ్యంతరం ఉంటే..అదే ప్రాంతంలో హోటల్ కట్టేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు ఎమ్మెల్యే. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలను తొలగించేందుకు తాను అంగీకరించబోనంటున్నారు.
ఈ వ్యవహారాన్ని పర్యావరణ శాఖ మంత్రి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కూడా ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. దీంతో సూర్యలంక బీచ్ వ్యవహారం ఒక్కసారిగా బాపట్ల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఆధిపత్య పోరుపై పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలో..లోకల్, నాన్ లోకల్ అంశం, సూర్యలంక అభివృద్ధి పనులపై వివాదం మరింత రాజుకున్నట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎంపీ కృష్ణప్రసాద్ ఎలా స్పందిస్తారు.? లోకల్, నాన్ లోకల్ వివాదం ఎటు టర్న్ తీసుకుంటుందో.? సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులు వివాదానికి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు అనేది వేచి చూడాలి మరి.
