ఒకనాడు మీరూ, నేనూ వరవరరావు ఒకే జైల్లో ఉన్నాం…ఆయన్ను దయతో విడిచిపెట్టండి : వెంకయ్యకు భూమన లేఖ

  • Publish Date - July 18, 2020 / 05:29 PM IST

కరోనా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విరసం నేత వరవరరావును విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి భూమన బహిరంగ లేఖ రాశారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వరవరరావును కాపాడాలంటూ లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న 81ఏళ్ల వయస్సు ఉన్న వరవరరావుపై ప్రభుత్వం దయ చూపించాలని భూమన కోరారు.

అనారోగ్య సమస్యలతో పాటు, ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిపడిన వరవరరావు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పధంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో బందీగా ఉన్నారంటే బాధగా ఉందన్నారు. వరవరరావు నిర్బంధంతో పాటు ఆయన అనారోగ్యంగా ఉన్నారు.

ఒకప్పుడు తనలో రాజకీయ ఆలోచనలకు ప్రోత్సాహం అందించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులుగా పేర్కొన్నారు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్‌రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా భూమన గుర్తు చేశారు. ముగ్గురు జైల్లో కలసి ఉన్నప్పుడు వరవరరావు మన సహా చరుడు అంటూ లేఖలో ప్రస్తావించారు.

రాజకీయంగా ఎవరి దారులు వారివే కావొచ్చు.. సిద్ధాంతాలు వేరు అయినప్పటకీ మానవతా దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని భూమన వెంకయ్యను కోరారు. మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరవరరావును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని, ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వానికి వామపక్ష పార్టీల నేతలు కూడా విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు