Horticulture
AP Govt : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు.. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు.. వారికోసం కొత్త పథకాలను అమలు చేస్తోంది. అయితే, తాజాగా.. రాయలసీమలో ఉద్యాన పంటలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది.
రాయలసీమ ప్రాంతంలో సాగునీటి కొరత బాగా ఉంది. అనుకున్న ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. అందువల్ల నీటి సమస్య మరికొన్నేళ్లు కొనసాగనుంది. అందుకే ప్రభుత్వం పూలు, పండ్ల మొక్కల సాగుకు ప్రోత్సాహాలు కల్పిస్తోంది. పూర్వోదయ పథకంలో భాగంగా.. వచ్చే నిధులను రాయలసీమలో 18రకాల ఉద్యాన పంటల కోసం ఉపయోగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 92 క్లస్టర్లుగా రైతులను విభజిస్తారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోని రైతులు ఈ ప్రయోజనాలు పొందుతారు.
Also Read: AP New Districts: ఏపీలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండు నెలల క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీలో పూర్వోదయ పథకం నిధుల గురించి చర్చించారు. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిపారు. ఆయా రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
రాయలసీమను ఇప్పటికే హార్టికల్చర్ హబ్ గా ఉంది. ఇక్కడి రైతులు 65 రకాల పండ్లు, కూరగాయలు, పూల సాగు చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ప్లాన్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 రకాల పంటలను ఎక్కువగా పండించాలని అనుకుంటోంది. అప్పుడు రైతులకు ఆ పంటల ద్వారా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
పూర్వోదయ పథకం ప్రయోజనాలను రాయలసీమ రైతులు పొందాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలను కలవాలి. ఏ పంటలు సాగు చేయ్యాలో, ఎలాంటి సబ్సిడీలు ఇస్తారో తెలుసుకోవాలి. అధికారులు నేల సారాన్ని పరీక్ష చేయించి, నీటి వనరుల లభ్యంత ఆధారంగా ఏ పంట వెయ్యాలో చెబుతారు. ఆ పంటను సాగు చెయ్యడం ద్వారా.. పూర్వోదయ పథకం కింద భారీగా సబ్సిడీలు, రాయితీలు పొందవచ్చు. తద్వారా రైతులకు చాలా ఖర్చులు తగ్గనున్నాయి.