bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు నలుగురు నేతలు, కేడర్ తప్ప… చెప్పుకునే ఉనికి కూడా లేదు. రెండు టెర్మ్‌లుగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నా… ఇక్కడ గుర్తింపు మాత్రం అంతంత మాత్రమే. అయితే, ఇటీవల కొంతకాలంగా బీజేపీ నెమ్మదిగా బలం పెంచుకుంటోందని అంటున్నారు.
టీడీపీలో అసంతృప్త నేతలపై బీజేపీ ఫోకస్:
పార్టీని బలోపేతం చేసే చర్యలు ఊపందుకున్నాయని చెబుతున్నారు. ఇతర పార్టీ నేతలను, కార్యకర్తలను ఆకర్షించేలా అధిష్టానం పావులు కదపడం, అందుకు తగ్గట్టుగా నేతలను ఉత్సాహపరచడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపై దృష్టి సారించిందని అంటున్నారు. టీడీపీలో అసంతృప్త నేతలను, నిస్సహయ స్థితిలో ఉన్న వారిని గుర్తించి, అక్కున చేర్చుకునేందుకు ప్రణాళికలు వేస్తోందని టాక్. వైసీపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో భయపడుతున్న నేతలపై బీజేపీ పెద్దలు ఓ కన్నేసి ఉంచారని టాక్.
ఎన్టీఆర్ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ను బీజేపీలో చేర్చుకున్నారు:
ఇటు ప్రతిపక్ష పార్టీలో సరైన గుర్తింపు లేక, అటు అధికార వైసీపీలోకి వెళ్లలేక మధ్యలో నలుగుతున్న నేతలపై వల విసురుతోందట. ఇందులో భాగంగానే ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబూరావును బీజేపీ చేర్చుకుంది. ఎన్టీఆర్ హయాంలో బాబూరావు ఒక వెలుగు వెలిగారు. రెండుసార్లు చీపురుపల్లి స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రభుత్వ విప్ పదవి చేపట్టారు. అప్పట్లో ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, జిల్లాలో చక్రం తిప్పే స్థాయికి చేరారు. ఆ తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయారు గద్దె. ప్రస్తుతం ఆయన వెంట వచ్చే కేడర్ పెద్దగా లేకపోయినా సీనియర్ నాయకుడిగా గుర్తించి పార్టీలో చేర్చుకుందంటున్నారు.
గద్దె బాబూరావు చేరికతో జిల్లా బీజేపీలో కొత్త జోష్:
గద్దె బాబూరావు చేరికతో జిల్లా బీజేపీలో కొత్త జోష్ వచ్చిందంటున్నారు. ఏది చేసినా, ఆర్భాటంగా చేయడం గద్దె బాబూరావుకి మొదటి నుంచి అలవాటు. బీజేపీలో తన ఎంట్రీని కూడా అంతే ఆర్భాటంగా ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ పార్టీ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ వంటి అగ్రస్థాయి నాయకుల సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. గద్దె ఎంట్రీతో పార్టీ కార్యాలయానికి ఒక్కసారిగా కొత్త కళ వచ్చిందని సంబరపడిపోతున్నాయట బీజేపీ వర్గాలు.
https://10tv.in/big-challenge-infront-of-chandrababu-regarding-vizianagaram-assembly-incharges-change/
బీజేపీలో చేరిన వారిపై కేసులు పెడితే జగన్ కు తిప్పలు తప్పవని వార్నింగ్:
బాబూరావు స్ఫూర్తితో ప్రస్తుతం టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మరికొంత మంది నేతలు కమలదళంలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. తమ పార్టీలోకి చేరే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, కేసులు పెడితే అధికార పార్టీకి తిప్పలు తప్పవంటూ పార్టీ అధ్యక్షుడు వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్‌కు మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయంటున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతల వైఖరితో చాలా మంది టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తే జైలుకెళ్లడం ఖాయమన్న ప్రచారం కొంత భయాందోళనలకు గురి చేస్తోంది.
త్వరలో బీజేపీలోకి మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ నేతలు:
మరోపక్క జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారు. ఇటీవల పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకం కూడా కొందరు సీనియర్లలో అసంతృప్తికి కారణమైందట. మరికొంతమంది అధిష్టానంపై తిరుగుబావుటా ఎగరవేశారు. ఇదే అవకాశంగా బీజేపీ తన పావులు కదుపుతోంది. టీడీపీ లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది. త్వరలో మరో ఇద్దరు ముగ్గురు నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీలోని నేతలపైనా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్:
ఇదే సమయంలో అధికార వైసీపీలోని కొంతమంది అసంతృప్త నేతల దృష్టి కూడా బీజేపీపై పడిందనే టాక్ వినిపిస్తోంది. పార్వతీపురానికి చెందిన ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది చోటామోటా నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరడం వెనుక కారణమదే అంటున్నారు. ఇటీవల వైపీపీ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన బీసీ కులాల కార్పొరేషన్ పదవి ఆశించి, భంగపడ్డ నేతలు, ప్రభుత్వ పాలనా విధానాలు నచ్చని మరికొంతమంది నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.