Somu Veerraju Misbehaved With Police
Somu Veerraju Misbehaved with Police : కాకినాడ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల్ని తోసేస్తూ నానా రగడ చేశారు. రావుపాలెం జొన్నాడ వద్ద సోమువీర్రాజు నా కారును ఎందుకు ఆపారంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఎస్సైని నెట్టేశారు. పోలీసులకు సోము వీర్రాజుకు మధ్య వాగ్వాగం చోటుచేసుకోవటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని సోమువీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోమువీర్రాజు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవరు ఆపమన్నారు ?. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. తన కారు ఎదుట ఉన్న మరొక వాహనదారుడిపైనా బండి తీయాలంటూ సోమువీర్రాజు హల్ చల్ చేశారు.
ఈ ఘటనపై సోము వీర్రాజు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. రాజమండ్రి నుంచే పోలీసులు నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీలో పోలీసులు ప్రజలకు సేవ చేయటం మానేసి రాజకీయ నేతలకు సేవల చేయటం అలవాటుగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు దమ్మూ సత్తువ పోయాయంటూ ఆరోపించారు.
సోము వీర్రాజు ప్రవర్తనలతో పోలీసులు షాక్ అయ్యారు. తోటి బీజేపీ నేతలు కూడా బిత్తరపోయారు. కాగా సోము వీర్రాజు వాహనాన్ని పోలీసులు నిలిపివేయటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎటువంటి ఘోర ఘటనలు జరిగినా హోంమంత్రి ఇంటికే పరిమితం అయిపోతారని..బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ శాంతి భద్రతలు కరవైపోయాయి అంటూ ఆరోపించారు. అమలాపురంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ఇల్లు తగులబెడితేనే రక్షించుచోనివారి ఏపీ ప్రజలను రక్షిస్తారా? అంటూ ప్రశ్నించారు. అమలాపురంలో బాధితులను పరామర్శించటానికి వెళుతుంటే అడ్డుకోవటం ఏంటి? అంటూ నిలదీశారు.