BJP politics in Andhra Pradesh on Kapu Community votes
Andhra pradesh Politics: ఏపీ రాజకీయం అంతా కాపుల చుట్టే తిరుగుతోందిప్పుడు. కాపుల మనసు గెలుచుకునేందుకు పార్టీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాపుల కోసం మేము.. మా వెంటే కాపులు అన్నట్లుగా పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. కమలం పార్టీ కూడా ఇప్పుడు ఇదే వ్యూహం అమలు చేస్తోంది. కాపుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. కాపు సమస్యలను జీవీఎల్ ప్రత్యేకంగా పార్లమెంట్ ప్రస్తావించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. కాపులను బీజేపీ టార్గెట్ చేసిందా.. జనసేన ఉన్నా లేకున్నా.. కాపు ఓట్లు తమకే దక్కేలా వ్యూహాలు రచిస్తోందా.. కాపుల వ్యవహారంలో బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా…అనే అంశాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
కాపు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ఏపీ బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ జీవీఎల్‌ను ముందు పెట్టి.. కొత్త గేమ్ మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది. నిజానికి జీవీఎల్ కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడు కాకపోయినా.. ఆయనను ముందు పెట్టి కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోంది. కొంతకాలంగా పదేపదే కాపుల రిజర్వేషన్‌పై జీవీఎల్ గట్టిగా మాట్లాడుతున్నారు. కాపుల సమస్యలన్నింటిని తన భుజాల మీద వేసుకున్నట్లు కనిపించారు. కేంద్రం నుంచి కూడా సానుకూలంగానే రియాక్షన్ వినిపిస్తోంది. ఈడబ్ల్యూసీలో కాపులకు రిజర్వేషన్ల వ్యవహారపై రాజ్యసభలో జీవీఎల్ ప్రశ్నించగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన సమాధానం రావడమే దీనికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత వంగవీటి రంగా పేరును కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని.. విజయవాడ ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని జీవీఎల్ కోరడం.. బీజేపీ వ్యూహానికి అద్దం పట్టిందనే చర్చ జరుగుతోంది.
కాపు ఓటర్లను బీజేపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సోము వీర్రాజు అయినా.. గతంలో కన్నా లక్ష్మీనారాయణ అయినా. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను కాపు సామాజికవర్గ నేతలకే కట్టబెట్టి తన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పింది కమలం పార్టీ. ఇక అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా పక్కనే ఉండడంతో.. ఏపీలో రాజకీయాన్ని డిసైడ్ చేసే కాపులు తమవైపే ఉన్నారనే ధీమాతో కనిపించారు. ఐతే ఇప్పుడు సీన్ మారింది. పవన్ కల్యాణ్.. క్రమంగా సైకిల్ వైపు జరుగుతున్నారు. పైకి చెప్పడం లేదు కానీ.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు కన్ఫార్మ్ అయింది. ఇలాంటి సమయంలో కాపు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. దీనికోసం జీవీఎల్‌ను ముందు పెట్టి తెరవెనక చక్రం తిప్పుతోందనే చర్చ జరుగుతోంది. ఐతే ఇదే ఇప్పుడు బీజేపీలో భిన్నాభిప్రాయాలకు కారణం అవుతోంది.