Andhra Pradesh
Andhra Pradesh: తెలంగాణ సహా ఉత్తరాది రాష్ట్రాలలో చెదురుమదురు జల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఢిల్లీలలో భారీ వర్షాలు కురవగా ఏపీలో మాత్రం అంతగా వర్షపాతం లేదు. ప్రస్తుతం జూన్ నెలాఖరు వచ్చినా ఏపీలో వర్షాల ప్రభావం అంతగా కనిపిండం లేదు. రుతుపవనాల రాకతో వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసినా అది ఏపీలో అంతగా ప్రభావం కనిపించలేదు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి బలహీన పడటంతో వర్షాల ప్రభావం కాస్త తగ్గినట్లుగా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రుతుపవన ద్రోణి బలహీన పడటం వలనే రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా లేవని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అయితే.. వారి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, రాష్ట్రంపై ఆదివారం నుంచి బ్రేక్ మాన్‌సూన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ శాఖ.. దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత వాతావరణం రైతులు వ్యవసాయ పనులు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని, రైతులు నారుమళ్లు, దుక్కి ఇతర పనులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.