Buddha Venkanna
Buddha Venkanna – Vizag: ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,000కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ (TDP) నేత బుద్దా వెంకన్న అన్నారు. విశాఖలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ఇటీవల సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని బుద్దా వెంకన్న తెలిపారు. అంతకు ముందు ఎల్జీ (LG) పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించారని అన్నారు. ఆ సంస్థను కాజేయడానికి కూడా వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.
సాహితీ ఘటనలో మృతులకు కూడా అధిక పరిహారం చెల్లించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఫార్మా సంస్థల నుంచి అధిక మొత్తంలో ఫండ్ ను విజయ సాయిరెడ్డి పోగు చేశారని చెప్పారు. అందుకే ఫార్మా సంస్థల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది పట్టించుకోవడం లేదని అన్నారు.
అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇటీవల సాహితీ ఫార్మా ఘటనలో మృతుల కుటుంబాలకు అందాల్సిన కోటి రూపాయల నష్ట పరిహారంలో 75 లక్షల రూపాయల చొప్పున అక్కడి మంత్రి, ఇతరులు కలిసి కాజేసి 25 లక్షలు రూపాయలు మాత్రమే ప్రకటించారని ఆరోపించారు.
వరుస ప్రమాదాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఏ1 జగన్ మోహన్ రెడ్డి, ఏ2 విజయ సాయిరెడ్డి ఢిల్లీకి వెళ్లారని, ఎందుకు వెళ్లారో చెప్పరని అన్నారు. ప్రధానిని కలిసిన అనంతరం ఎందుకు కలిశామో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలని, కానీ పని చెయ్యరని విమర్శించారు. కేసులు ఎప్పుడు ఎత్తేస్తారా.. ఎప్పుడు మోదీకి సాష్టాంగ నమస్కారాలు చేద్దామా.. అనే ధ్యాస మాత్రమే జగన్ కు ఉందని చెప్పారు.
YS Jagan Mohan Reddy : ఏం జరుగుతోంది? ప్రధాని మోదీతో సీఎం జగన్ కీలక భేటీ