Rushikonda
Rushikonda: ఎన్నికలకు ముందు అదే రచ్చ. ఎన్నికలు అయిపోయి..15 నెలలు అవుతున్నా..ఆ భవనాల చుట్టే ఏపీ పాలిటిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ కట్టడాలు వైసీపీకి చేయాల్సినంత డ్యామేజ్ చేశాయి. కూటమికి కావాల్సిన ప్లస్ పాయింట్‌గా మారాయి. అయినా ఇప్పటివరకు రుషికొండ భవనాలు రెగ్యులర్ ఎపిసోడ్‌లాగా ఉండిపోతున్నాయి. ప్రతీ నెల రోజులకోసారి ఏదో విధంగా సాగరతీరంలో వైసీపీ హయాంలో కొండను తవ్వేసి కట్టిన కట్టడాల మీదే డిస్కషన్ నడుస్తోంది.
ఇప్పుడు మరోసారిలైమ్‌లైట్‌లోకి వచ్చేసింది రుషికొండ ఇష్యూ. విశాఖ సాగర తీరాన వైసీపీ హయాంలో కట్టిన రుషికొండ భవనాల రచ్చ క్లైమాక్స్‌కు చేరేలా కనిపిస్తోంది. సర్కార్ క్యాబినెట్ సబ్‌కమిటీ చర్చలు స్టార్ట్ చేయడంతో..రుషికొండ నిర్మాణాలను దేనికి యూజ్ చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాలను ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది?
ప్రభుత్వమే వాడుకుంటుందా? రిసార్టులు, హోటల్స్ కోసం రెంట్‌కు ఇస్తారా? సబ్ కమిటీ సూచనలు ఎలా ఉండబోతున్నాయి? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదంతా ఇలా ఉండగానే రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్‌గా మార్చాలని గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు వంటి వాళ్లు ప్రతిపాదించడం హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ కట్టడాలతో నెలకు రూ.25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని చెబుతోంది ప్రభుత్వం. గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు మంత్రులు.
అయితే, రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని, ప్రజల అభిప్రాయం ప్రకారం డెసిషన్ తీసుకోవాలి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. హోటల్స్ నిర్వహణ, మానసిక వికలాంగుల చికిత్సాలయ ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందట. అయితే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే రుషికొండ భవనాలపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట.
రుషికొండ భవనాలను విషయంలో కూటమి టార్గెట్‌గా వైసీపీ. జగన్ ఫ్యామిలీ సాగర తీరంలో సేద తీరేందుకు..అద్భుతమైన ప్యాలెస్ కట్టారని ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది కూటమి. అందులో బాత్ టబ్‌లు, లైటింగ్ అరేంజ్‌మెంట్స్..సీ వ్యూ..అంతా జగన్ ఇష్ట ప్రకారం..అతని కుటుంబ సౌఖ్యం కోసం నిర్మించారని విమర్శిస్తున్నారు. ఈ అలిగేషన్స్‌ను తిప్పికొట్టడంతో వైసీపీ ఇప్పటికీ ఫెయిల్ అవుతూ వస్తూనే ఉంది.
ఈ క్రమంలో అదే రుషికొండ భవనాలను అస్త్రంగా చేసుకుని జగన్‌ను, వైసీపీని సందర్భం దొరికినప్పుడల్లా ర్యాగింగ్ చేస్తున్నాయి కూటమి పార్టీలు. పైగా మెంటల్ హాస్పిటల్‌గా మారుస్తామన్న ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి ఇండైరెక్టుగా జగన్‌ను టార్గెట్ చేస్తోంది. వైసీపీ హయాంలో తుగ్లక్ పాలన జరిగిందని..టీడీపీ, బీజేపీ, జనసేన మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్నాయ్. కానీ ఇది రాజకీయ విమర్శగానే భావించారు జనం. కానీ ఇప్పుడు రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్‌గా మారుస్తామన్న టాక్‌తో..మళ్లీ జగన్‌ను ర్యాగింగ్ చేస్తోంది కూటమి. రుషికొండ భవనాలపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందో..వైసీపీ రియాక్షన్ ఏంటో చూడాలి మరి.