శానసమండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఎలాగైనా బిల్లులను నెగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కానీ మండలి రద్దు అంత సులభం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ యనమల.
2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం 2020, జనవరి 21వ తేదీ మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులు మండలిలో ప్రవేశపెట్టగానే అనూహ్యంగా టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది. ఈ రూల్‌ను మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. దీనిని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మండలిని రద్దు చేయాలని డిసైడ్ అయ్యింది.
దీనిపై మంగళవారం యనమల మీడియాతో మాట్లాడుతూ..కౌన్సిల్ రద్దు చేయాలంటే చాలా ప్రక్రియ ఉంటుందన్నారు. పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యమని స్పష్టం చేశారు. రద్దు చేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.
* శాసనసమండలిలో షరీఫ్ రూల్ 71కు అనుమతించడంపై వైసీపీ మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
* టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
* తనకు రాజకీయాలు ఆపాదించవద్దని మండలి ఛైర్మన్ షరీఫ్ సూచించారు.
* నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని షరీఫ్ అన్నారు.
* మండలి రద్దు కోసం ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కావాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.
* మంగళవారం రాత్రి 10గంటలకు జరిగే కేబినెట్ భేటీలో మండలి రద్దుపై చర్చించి నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.
* 2020, జనవరి 22వ తేదీ బుధవారం ఏపీ శాసనసభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టనున్నారని సమాచారం.
Read More : రాసుకో సాంబ : అమరావతే శాశ్వత రాజధాని – పవన్ కళ్యాణ్