Supreme Court
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఆరోపిస్తూ ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఆలయ రోజువారీ ఆచార వ్యవహారాల్లో రాజ్యాంగపరంగా న్యాయస్థానం జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
నిర్దేశించిన నియమాలు, నిబంధనలను పాటించేలా.. ఆలయ నిర్వహణకు సంబంధించిన సమస్యలను మాత్రమే చూడగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆచారాలు మరియు సేవకు సంబంధించిన సమస్యలపై కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని వెల్లడించింది.
“మేము ఆలయ ఆచారాలలో జోక్యం చేసుకోగలమా? కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి లేదా హారతి ఎలా పట్టాలి?” అని పిటీషనర్‌ను ప్రశ్నించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని ధర్మాసనం స్పష్టం చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార వ్యవహారాలను సరిదిద్దాలని కోరుతూ పిటీషనర్ అంతకుముందు హైకోర్టులో పిల్ వేయగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టివేసింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన భక్తుడి స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామికి పూజలు మరియు సేవ చేసే విధానం ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని టీటీడీ కూడా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. పిటీషనర్ కేవలం ప్రచారం కోసమే వస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.