ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అమరావతి పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ ప్రాంత ఎమ్మెల్యేలైన శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని రైతులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వారి ఫిర్యాదుకు ఫలితం దక్కినట్టుగానే కనిపిస్తోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చారు. జనాల దగ్గరకు నేరుగా వెళ్లక పోయినా మీడియా ముందుకొచ్చి… తాను ఎక్కడకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికే తన మద్దతని కూడా ప్రకటించారు. అంతా బాగానే ఉన్నా.. సబ్జెక్టును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని జనాలు అంటున్నారు.
ఎందుకు కనిపించలేదంటే? :
తానెందుకు ఇన్నాళ్లూ జనానికి కనిపించలేదో చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే.. మధ్యలో చంద్రబాబు ప్రస్తావన యధావిధిగా తీసుకొచ్చారు. కుప్పంలో చంద్రబాబు కనిపించడం లేదని అక్కడ జనాలు ఫిర్యాదు చేశారన్నారు. ఇక్కడ రైతులు ఆందోళనలు చేస్తుంటే వారికి నచ్చజెప్పాల్సింది పోయి.. మధ్యలో బాబు ప్రస్తావన ఎందుకని అంటున్నారు. ఒక పార్టీ అధినేతగా చంద్రబాబు కుప్పంలోనే ఉండేందుకు వీలుండదు.
అలానే జగన్ కూడా పులివెందులలోనే ఉండే పరిస్థితి లేదు. ఆ ప్రాంతాలకు వారిద్దరూ ఎమ్మెల్యేలు అయినా రాష్ట్రమంతా వారు కలియతిరగాల్సిన పరిస్థితులున్న నేపథ్యంలో వారి ప్రతినిధులే నియోజకవర్గాల్లో పనులు చక్కబెడతారు. కానీ, ఇక్కడ తమపై రైతులు ఫిర్యాదులు చేశారన్న కారణంగా కుప్పంలో బాబుపై ఫిర్యాదు చేయడం వింతగా ఉందని జనాలు గుసగుసలాడుతున్నారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటించినప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వ నిర్ణయంతో లోకల్ ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. నేరుగా ఆ ప్రాంత ప్రజలను కలుసుకోలేక పోతున్నారు.
అమరావతి నుంచి రాజధానిని తరలించకూడదంటూ చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు తమ ఎమ్మెల్యే కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించకుండా పోయారంటూ రాజధాని రైతులు పలువురు మండిపడుతున్నారు.
అమరావతి రైతులకు ఏం చెప్తారో :
తమకింత కష్టం ఎదురైతే లోకల్ ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం ఏంటంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ టైమ్‌లో జనాల్లోకి వెళ్లలేక… ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక ఆర్కే సతమతమై పోతున్నారట. కాకపోతే సడన్‌గా బయటకొచ్చి మీడియా ముందు రెండు ముక్కలు మాట్లాడేశారు.
వారం పది రోజులుగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నాక బయటకొచ్చిన ఆయన… జగన్ నిర్ణయాన్నే సమర్థిస్తున్నారు. పార్టీ పరంగా ఇది తప్పదు కాబట్టి ఆయన అలాంటి నిర్ణయాన్ని ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు అమరావతి రైతులను ఆయన ఎలా సర్ది చెబుతారన్నదే ఆసక్తిగా మారింది.
తెలుగుదేశం పార్టీలో ప్రాంతాల పరంగా నాయకులు విడిపోయారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఇలాంటి భిన్నాభిప్రాయాలకు అర్థముంది. కానీ, జగన్ నిర్ణయం పట్ల స్థానికుల్లో వ్యతిరేకత ఉన్నా అమరావతి ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం చేయగలిగిందేమీ లేని పరిస్థితుల్లో ఉన్నారట.
ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేశ్‌పై విరుచుకుపడే ఆయన ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక చివరకు జగన్ నిర్ణయమేదైనా మద్దతు ఇస్తానని మాత్రం ప్రకటించేసి, మధ్యలో చంద్రబాబు మిస్సింగ్ ప్రస్తావన తీసుకు రావడం విడ్డూరంగా ఉందంటున్నారు.