Cbi Ex Jd Lakshmi Narayana
CBI ex JD Lakshmi Narayana : ఎంతో మంది అక్రమార్కుల ఆటకట్టించిన ఆయన ఇప్పుడు అన్నదాతగా మారారు. రైతులు పడుతున్న కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని ప్రభుత్వాల దృష్టికి తేవాలన్న తపన ఆయన్ను ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆయనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. స్వతహాగా రైతులన్నా, వ్యవసాయమన్నా ఎంతో మక్కువ. రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించారు. రైతులను కలసి వారి సాధక బాధలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలో తానే స్వయంగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రైతులు ఎంతో శుభదినంగా భావించే ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులను ప్రారంభించారు. పొలాన్ని దున్నారు. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానన్నారు.
లక్ష్మీనారాయణ వ్యవసాయంలోకి దిగారని తెలిసిన వారంతా ఇప్పుడు తామూ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. కరోనా ప్రభావంతో అందరికీ వ్యవసాయం విలువేంటో తెలిసొచ్చిందని రైతన్నలు అనుకుంటున్నారట.