AP special status
AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా అనేదే లేనే లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదు అంటూ స్పష్టం చేసింది. సోమవారం (డిసెంబర్ 12,2022) పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మరోసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.
సభ్యుల ప్రశ్నకు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వంగా సమాధానం ఇచ్చారు. గతంలో వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రిత్యా జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని..అయితే 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదంటూ పేర్కొన్నారు.
ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధుల బదలాయింపుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుందని..14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2015- 2020 మధ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని..నిధుల పంపిణీ తర్వాత కూడా వనరులు లోటు ఉండే రాష్ట్రాలకు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు వుండే రాష్ట్రాలకు రెవెన్యూ లోటు (డెఫిసీట్ గ్రాంట్స్) గ్రాంట్స్ అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.