Pawan Kalyan : అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ.. చంద్రబాబు, పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని మగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా..

Chandrababu and Pawan Kalyan with modi (File Photo)

Pawan Kalyan – Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. మగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లినప్పటికీ.. త్వరలో అమెరికాలో జరిగే ఎన్నికల అంశానికి మాత్రం మోదీ దూరంగా ఉన్నారు. పర్యటనలో మొదటి రోజైన శనివారం ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడాతో యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్ లో మోదీ భేటీ అయ్యారు. అక్కడ నలుగురు లీడర్లు క్వాడ్ సమ్మిట్ కు హాజరయ్యారు. తరువాత ఆస్ట్రేలియా, జపాన్ లీడర్లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆదివారం మోదీ న్యూయార్క్ లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. సోమవారం న్యూయార్క్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీతో భేటీ అయ్యారు. పలు దేశాల అధినేతలు మోదీతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటన విజయవంతం ముగించుకొని మోదీ భారత్ చేరుకున్నారు. అయితే, మోదీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Also Read : Indian antiquities: అమెరికా దొంగిలించిన భారతీయ పురాతన వస్తువులు తిరిగొస్తున్నాయ్.. వాటిలో ప్ర‌ధాన‌మైనవి ఇవే..

పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించింది. ప్రతి కరచాలనం, ప్రతి ప్రసంగం, 1.4 బిలియన్ ప్రజల ఆశలు, కలలను మోసుకెళ్లారు. క్వాడ్ సమ్మిట్ కు నాయకత్వం వహించడం నుంచి యూఎన్ ప్యూచర్ సమ్మిట్ వరకు మోదీ నాయకత్వం ప్రపంచ వేదికపై భారతదేశం బలాన్ని ప్రదర్శించింది. మోదీ ప్రభావవంతమైన సమావేశాలు, సెమీకండక్టర్ ప్లాంట్ ను భద్రపర్చడం, 297 అమూల్యమైన పురాతన వస్తువులను భారత్ తిరిగి పొందడం. అత్యాధునిక సాంకేతికతతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చడం భారతదేశ పునరుజ్జీవనంలో మైలురాళ్లు. భారతదేశం ఇప్పుడు మార్పుకోసం చోదక శక్తిగా ఉంది. ప్రధాని దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్ అద్భుత విజయాలను అందుకుంటుంది.. ఇది మన క్షణం.. అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

అమెరికా పర్యటన ముగించుకొని భారత్ కు తిరిగి వచ్చిన ప్రధాని మోదీకి ‘ఎక్స్’ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతం చెప్పారు. ప్రధాని మోదీ వంటి రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారత్ ను ప్రపంచ దేశాలన్నింటి కంటే అత్యున్నత స్థానంలో నిలిపారని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అగ్రనాయకుడిగా ఎదిగారు. అన్ని దేశాలనూ ఏకతాటిపైకి తసీుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం అని చంద్రబాబు పేర్కొన్నారు.