బాబు దీక్ష విరమణ : అధికారం వద్దు..పదవులు వద్దు

  • Publish Date - November 14, 2019 / 02:03 PM IST

‘నాకు అధికారం వద్దు..పదవులు వద్దు…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా’ ? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని చూస్తున్నారని, సామాన్యుడికి ఇసుక దొరక్కుండా వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఇసుక కొరతపై ధర్నా చౌక్‌లో బాబు దీక్ష చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష..రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా బాబు…వైసీపీ ప్రభుత్వం, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

పేద వాడు నాశనమైనా ఫర్వాలేదు..కేవలం డబ్బుల కోసమే ఇసుక కొరత సృష్టించారని విమర్శించారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఇసుక తరలిస్తున్నారని, వేరే రాష్ట్రాలకు పంపిస్తుంటే.. భవన నిర్మాణాలను వాయిదాలు వేసుకోవాలా అని ప్రశ్నించారు. నిర్మాణ కార్మికులు అర్థాకలితో అలమటిస్తుంటే..జగన్‌కు కనబడడం లేదా అంటూ నిలదీశారు. సిమెంటు ఫ్యాక్టరీలను బెదిరిస్తున్నారని ఆరోపించారాయన. కృతిమ ఇసుక ద్వారా 40 నుంచి 50 మంది ప్రాణాలు తీశారని, ఎన్నో లక్షల మంది అర్థాకలితో అలమటిస్తున్నారని తెలిపారు. 

మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల బాధ చూసి చలించిపోయానన్నారు. తనపై కక్షతోనే పేదలను బాధ పెడుతున్నారని, తప్పు చెబితే..తనపై దాడి చేస్తారా ? ఒక్క నాయకుడు పోతే..ఏంటీ..వంద మంది నాయకులు తయారు చేస్తామని తమ పార్టీకి చెందిన నేతలు అంటున్నారని, ఇటీవలే పార్టీ నుంచి వెళుతున్న లీడర్స్ గురించి వ్యాఖ్యానించారు. బాబాయ్‌ని చంపిన వ్యక్తి ఇంతవరకు పట్టుకోలేదని, ఇక ప్రజల గురించి ఏం ఆలోచిస్తారని బాబు ప్రశ్నించారు. 
Read More : పవన్ కళ్యాణ్‌కు అక్కడొక గొంతు.. ఇక్కడ ఒక గొంతు: వల్లభనేని వంశీ