ఆయనకు ఎంపీ సీటు ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది: చంద్రబాబు

నర్సాపురం ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస వర్మపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu on Bhupathi Raju Srinivasa Varma: నర్సాపురం ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస వర్మపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు సహాయ మంత్రి దక్కిందని చెబుతూ.. బీజేపీలో ఇదే ప్రత్యేకత అని వ్యాఖ్యానించారు. ”బీజేపీలో శ్రీనివాస వర్మ సామాన్యమైన కార్యకర్త. ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది. బీజేపీలో కూడా ఇదో ప్రత్యేకత. శ్రీనివాస వర్మకు ఎంపీ సీటు ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఒక మామూలు వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చారు. అప్పుడు ఆలోచించాం. ఎంక్వైరీ చేస్తే ఆయన పార్టీ కోసం స్ట్రాంగ్‌గా పనిచేశారని తెలిసింది. ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టీడీపీ, జనసేనలో కూడా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నామ”ని చంద్రబాబు చెప్పారు.

Also Read: పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్: చంద్రబాబు నాయుడు

మనందరి కల వికసిత్ ఆంధ్రప్రదేశ్
10 సంవత్సరాల మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచిందని, ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చిందన్నారు. 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ 3.0 ఐదేళ్ల పాలనలో 5 స్థానం నుంచి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఇండియా నిలవబోతోందన్నారు. 2047 నాటికి మోదీ కల వికసిత్ భారత్, మనందరి కల వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం మనమంతా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ కలను సాకారం చేద్దాం
”జీరో ప్రవర్టీ నేషన్, జీరో ప్రవర్టీ స్టేట్, జీరో ప్రవర్టీ నియోజకవర్గం.. ఇది ఎన్టీ రామారావు కల. ఆర్థిక సంస్కరణలు రావడానికి ముందు ప్రతి ఒక్కరినీ కమ్యునిజం, క్యాపిటలిజం, సోషలిజం గురించి అడిగేవారు. ఎవరిని అడిగినా మీరు ఏ సైడు ఉంటారని అడిగేవారు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావును మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే.. నాకు ఇజాల గురించి తెలియదు, నాకు తెలిసిన ఒకే ఒక్క ఇజం హ్యుమనిజం అని భారత దేశంలో చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. పేదరికం లేని సమాజం కోసం ఆయన తప్పించారు. ఆయన కలను సాకారం చేద్దామ”ని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు