పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్: చంద్రబాబు

ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలోనే లేదని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్: చంద్రబాబు

Chandrababu Naidu: ఈసారి ఎన్నికల్లో ఏపీలో దక్కిన విజయం దేశ చరిత్రలోనే లేదని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఈ మాండేట్ వల్ల ఢిల్లీలో తమను అందరూ గౌరవిస్తున్నారని వెల్లడించారు. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలేదన్నారు. స్టైకింగ్ రేటు 93 శాతం రావడం అరుదైన అనుభవమని చెప్పారు.

అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వెల్లడించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అభినందించారు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అధికారం వచ్చిందని విర్రవీగితే ఫలితాలు ఇలాగే ఉంటాయని.. ఇవన్ని కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిన అవసరముందన్నారు. విధ్వంసకర రాజకీయాలుకు పుల్ స్టాప్ పడాలన్నారు.

”శాసనసభ నాయకుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. మూడు పార్టీలు నూటికి నూరుశాతం పరస్పరం సహకరించుకోవటం వల్లే విజయం సాధ్యమైంది. 93శాతం గెలుపు సాధించటం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలి. జనసేన 21 సీట్లు తీసుకుని 21సీట్లూ గెలిచాయి. బీజేపీ 10 సీట్లు తీసుకుని 8 గెలవడం మామూలు విషయం కాదు. జైల్లో నన్ను కలిశాక పొత్తు ప్రకటన తొలుత పవన్ కళ్యాణ్ చేశారు. ఆ రోజు నుంచీ ఎలాంటి పొరపచ్ఛాలు లేకుండా మూడు పార్టీలు కలిసేలా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అధినేతలు కలిసి ప్రచారం చేయటం క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి మార్గం సుగమమైంద”ని చంద్రబాబు అన్నారు.