Solar Panels : బాబోయ్ సమ్మర్.. మీ ఇంట్లో 1.5 టన్ AC కోసం ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరమో తెలుసా? ఫుల్ గైడ్
Solar Panels : అసలే సమ్మర్.. ఏసీల వాడకం ఎక్కువగా ఉండే సీజన్.. మీ ఇంట్లో 1. 5 టన్ ఏసీ ఉంటే.. అది రన్ అవ్వాలంటే ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం పడుతుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Solar Panels
- వేసవిలో ఏసీలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్
- సోలార్ ప్యానెల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
- 1.5 టన్ ఏసీ ఇంట్లో నడవాలంటే ఎన్ని సోలార్ ప్యానెల్స్ అవసరం
Solar Panels : సమ్మర్ వచ్చేసింది. ఎండలు కూడా మండిపోతున్నాయి. అందరూ ఏసీలు కొనేందుకు ఎగబడుతున్నారు. అయితే, వేసవిలో ఏసీలు ఎక్కువగా వాడితే పవర్ బిల్లు ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. ఎందుకంటే.. ఎండకాలంలో ఏసీలు ఎక్కువ సమయం రన్ అవుతుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల మొదలై వారం గడిచేలోపే ఏసీల వాడకం మరింత పెరగనుంది.
దాంతో రాబోయే పవర్ బిల్లు ఎంత అవుతుందోనని భయపడిపోతుంటారు. అందుకే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే పవర్ బిల్లు గురించి ఆందోళన అవసరం ఉండదు. సాధారణంగా చాలా ఫ్యామిలీలకు ఈ వేసవిలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంటుంది.
సోలార్ పవర్ సరిగా వాడుకుంటే కరెంటుతో పనేలేదు. అయితే, సోలార్ ప్యానెల్ ఏర్పాటుపై ప్లానింగ్ దశలోనే చాలా మంది ఇబ్బంది పడతారు. మీకు ఎన్ని ప్యానెళ్లు అవసరం? ఏ ఇన్వర్టర్ కొనాలి? బ్యాటరీలు ప్రయోజనకరమా కాదా? అని నిర్ణయించుకోవాలి. అత్యంత సాధారణ సెటప్ 1.5-టన్ స్ప్లిట్ సిస్టమ్‌తో వస్తుంది.
1.5-టన్ ఏసీకి ఎంత పవర్ అవసరం :
సాధారణ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ పూర్తి లోడ్‌లో నడిస్తే 1,200 నుంచి 2,000 వాట్ల వరకు పవర్ తీసుకుంటుంది. ఇన్వర్టర్ మోడళ్లు సాధారణంగా తక్కువ విద్యుత్ తీసుకుంటాయి. గది వేడిని బట్టి కంప్రెసర్ వేగాన్ని అడ్జెస్ట్ చేసుకుంటాయి. తద్వారా గరిష్ట స్థాయిలో పనిచేయవు.
అయితే, సాధారణ నాన్-ఇన్వర్టర్ యూనిట్లు సుమారు 2,400 వాట్ల వరకు విద్యుత్‌ను తీసుకుంటాయి. కనీసం 1,500 వాట్లను ప్రామాణికంగా తీసుకుంటే.. ఏసీని రోజుకు 8 గంటలు నడిపితే సుమారుగా 12kWh విద్యుత్ వినియోగించుకుంటుంది. వేసవిలో 30 రోజులకు లెక్కిస్తే.. చాలా త్వరగా పవర్ వాడేస్తుంది.
ఎన్ని సోలార్ ప్యానెళ్లు అవసరం? :
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చాలా భారతీయ నగరాల్లో సుమారు 5 గంటల పాటు సూర్యరశ్మి వస్తుంది. 330-వాట్ల సోలార్ ప్యానెల్ సాధారణంగా రోజుకు 1.3 నుంచి 1.5kWh విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అంటే.. 12kWh రోజువారీ లోడ్ కోసం 8 నుంచి 9 ప్యానెళ్లు అవసరమవుతాయి. నీడ పడటం, ప్యానెళ్లపై దుమ్ము వంటివి క్లీన్ చేయడంతో పాటు కొందరు ఇన్స్టాలర్లు ఒక్కొక్కటి 250 నుంచి 300 వాట్ల సామర్థ్యం గల 10 లేదా 12 ప్యానెళ్లకు పెంచమని సిఫార్సు చేస్తారు.
ఇన్వర్టర్ కూడా ముఖ్యమే. సాధారణంగా కనీసం 2.5 నుంచి 3 kW సామర్థ్యం గల ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ను సిఫార్సు చేస్తారు. ఎందుకంటే.. ఏసీ కంప్రెసర్లు స్టార్ట్ అయినప్పుడు అధిక మొత్తంలో పవర్‌ను తీసుకుంటాయి. తక్కువ సామర్థ్యం గల ఇన్వర్టర్ సరిగా పనిచేయదు.
బ్యాటరీ ఉండాలా వద్దా? :
ఏసీ కేవలం పగటిపూట మాత్రమే నడిస్తే బ్యాటరీ బ్యాకప్ అవసరం లేని ఆన్-గ్రిడ్ సిస్టమ్ సరిపోతుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. రాత్రిపూట కూలింగ్ అవసరమైతే బ్యాకప్ కోసం సుమారు 8 నుంచి 10kWh బ్యాటరీ స్టోరేజ్ ఉండాలి.
అప్పుడు ధర భారీగా పెరుగుతుంది. ప్యానెళ్లు, ఇన్వర్టర్తో 5kW ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ ధర సుమారుగా రూ. 2,99,999 నుంచి ప్రారంభమవుతుంది. తగ్గిన విద్యుత్ బిల్లులతో సాధారణంగా 4 నుంచి 6 ఏళ్లలోపు పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకోవచ్చు.
