Chandrababu Naidu
Chandrababu Naidu – TDP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ (YCP) నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారిలో మహమ్మద్ గౌస్, ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ పాణ్యం సావిత్రమ్మ, ఆమె అనుచరులు, వైశ్య సామాజిక వర్గం నుంచి రవీంద్ర, అతని అనుచరులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అన్నం తినే వ్యక్తి జగన్ కు ఓటేయడని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు పులివెందుల్లో ఓటమి ఖాయమని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ ప్రజలు నాలుగేళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నారని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ ను ప్రొద్దుటూరు బకాసురుడిగా చంద్రబాబు అభివర్ణించారు. ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్తను చంపేశాడని చెప్పారు. మామూళ్లు వసూలు చేయడం రాచమల్లుకు అలవాటని అన్నారు.
ఒకప్పుడు కౌన్సిలరుగా కూడా గెలవలేని వ్యక్తి.. ఇప్పుడు ప్రొద్దుటూరును మింగేసే స్థాయిలో బలిసిపోయాడని విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రజలపై విద్యుత్ భారం పెరిగిపోయిందని, టీడీపీ ప్రభుత్వం రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని అన్నారు. నిత్యావసర ధరలు కూడా పెరిగాయని చెప్పారు.
టీడీపీ పాలనలో ధరలు పెరిగితే నియంత్రించామని అన్నారు. ఉల్లిపాయ ధరలు పెరిగితే నాసిక్ నుంచి ఉల్లిపాయలు తెప్పించి ధరలను నియంత్రించామని చెప్పారు. ఇప్పుడు చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగనేనని అన్నారు. ప్రొద్దుటూరు డెయిరీని ఎందుకు ఓపెన్ చేయలేదని నిలదీశారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను అమూల్ కు ఇచ్చేశారని ఆరోపించారు.
కర్ణాటకలో అమూల్ డెయిరీని అంగీకరించలేదని చెప్పారు. తెలంగాణలో విజయ డెయిరీని అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. అమూల్ డెయిరీకి ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో లెక్కలు చెప్పాలని అన్నారు. జగన్ మాట్లాడితే హెరిటేజ్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ ను బూచిగా చూపిస్తూ రాష్ట్రంలోని పాడి రైతుల ఆస్తులను ఇతర రాష్ట్రాలకు కట్టబెట్టడం ఏంటని విమర్శించారు.