సీట్ల సర్దుబాటుపై ముగిసిన చర్చలు.. బీజేపీ, జనసేన పార్టీలు పోటీచేసే ఎంపీ స్థానాలు ఇవే!?

టీడీపీ ఎన్డీయేలో చేరిక,  ఏఏ నియోజకవర్గాలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాలపై నేడు లేదా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

BJP-TDP-Jana Sena Alliance_

TDP Will Join NDA : ఏపీలో త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిగా పోటీ చేయడంపై క్లారిటీ వచ్చేసింది. శనివారం కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు జరిగింది. మూడు పార్టీల మధ్య లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. జనసేన, బీజేపీ కలిపి ఎనిమిది పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో, టీడీపీ 17 పార్లమెంట్, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మూడు పార్టీల అధినేతలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగియడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరిగి విజయవాడ బయలుదేరనున్నారు. పొత్తుల విషయం, సీట్ల అంశంపై జేపీ నడ్డా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Also Read : తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు

మూడు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనుండగా.. అనకాపల్లి, మచిలీపట్నంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తొలుత జనసేన పోటీ చేయాలని భావించింది. పొత్తుల నేపథ్యంలో ఆ స్థానాన్ని జనసేన బీజేపీకి కేటాయించేందుకు సిద్ధమైంది.. దీంతో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచికూడా బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని సమాచారం. మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.

పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావడంతో టీడీపీ ఎన్టీయేలో చేరికకు రంగం సిద్ధమైంది. టీడీపీ ఎన్డీయేలో చేరిక,  ఏఏ నియోజకవర్గాలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాలపై త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు