రాజధాని మార్పుపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే
రాజధాని మార్పుపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే కేపిటల్ గా కొనసాగించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ(జనవరి 13,2020) అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. పెనుకొండలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.
రాజధాని విశాఖకు మార్చుకోండి:
రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోవాలన్నారు. వైసీపీ గెలిస్తే నేను రాజకీయాలే వదిలేస్తా అని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే జగన్ దీనికి ఒప్పుకోరు అని చంద్రబాబు అన్నారు. రాజధానిపై ఓటింగ్ నిర్వహించి అమరావతా? విశాఖ? అన్నది తేల్చాలని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులు బోగస్ రిపోర్టులని.. వాటిని భోగి మంటల్లో వేసి చలి కాచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలంగాణ మంత్రి సంతోషంగా ఉన్నారు:
రాజధాని విశాఖకు మారిస్తే రాయలసీమ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడతారని చంద్రబాబు వాపోయారు. రాయలసీమ నుంచి విశాఖకు వెళ్లాలంటే రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. విశాఖకు వెళ్లేందుకు రెండు రోజులు.. వచ్చేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని.. అది అమరావతే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధపడ్డారని.. మూడు రాజధానుల వల్ల తమకే లాభం అంటూ తెలంగాణకు చెందిన ఓ మంత్రి అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పింది తానేనన్నారు. ఇప్పుడు హైకోర్టును కూడా 3 ముక్కలు చేస్తామని చెప్పడం దారుణం అన్నారు.
రాజధాని కోసం రైతు ఆత్మహత్యాయత్నం:
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. తుళ్లూరులో రైతుల మహాధర్నాలో రైతులు, కూలీలు పాల్గొన్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను కూడా లెక్క చేయకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. మా భూములిచ్చాం రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతుల్లో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించడంతో… పోలీసులు అలర్ట్ అయ్యి రైతును అడ్డుకున్నారు.