Chandrababu
Chandrababu: కాసేపట్లో తిరుపతిలో అడుగుపెట్టనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముందుగా శ్రీవారి దర్శనం చేసుకుని తర్వాత అమరావతి రైతుల సభకు హాజరు కాబోతున్నారు చంద్రబాబు.
‘అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ’ పేరిట సాగుతున్న సభకు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు హాజరుకాబోతున్నాయి. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇవాళ్టి తిరుపతి బహిరంగసభతో ముగియనుంది.
కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగిన పాదయాత్ర.. నాలుగు జిల్లాలు, 500 కిలోమీటర్ల మేర సాగింది. తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేణిగుంట సమీపంలో దాదాపు 20 ఎకరాల్లో.. స్పెషల్ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, సభకు వచ్చే వారికి భోజన ఏర్పాట్లతో.. సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6గంటల వరకు.. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ జరగనుంది.
అమరావతి రైతుల సభకు అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు .. ప్రజాసంఘాలని ఆహ్వానించారు జేఏసీ నేతలు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.