అందుకే జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీలో చేరాను: చేగొండి సూర్యప్రకాశ్

Chegondi Surya Prakash: నమ్ముకున్న వారిని పవన్ కల్యాణ్ నట్టేట ముంచేశారని చెప్పారు. మనోహర్, నాగబాబుని తప్ప..

పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని నడపడం చేతకాని అసమర్థుడు అంటూ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్‌ విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన హరిరామ జోగయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో పవన్‌ను నమ్మి జనసేన పార్టీలోకి వెళ్లానని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నానని, కానీ ఆయన పైకి చెప్పేది ఒకటి.. లోపల ఉండేది మరొకటి అని అన్నారు. టీడీపీకి కొమ్ము కాయడానికే పార్టీని నడుపుతున్నారని చెప్పారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని తెలిపారు.

పార్టీ పెట్టి పదేళ్లు అయినా బూత్ కమిటీలు వెయ్యలేదని విమర్శించారు. పార్టీని మొత్తం నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టి టీడీపీకి అప్పగించారని అన్నారు. నమ్ముకున్న వారిని పవన్ కల్యాణ్ నట్టేట ముంచేశారని చెప్పారు. మనోహర్, నాగబాబు తప్ప వేరే వాళ్లని పక్కన కూర్చోబెట్టుకోవడం లేదని అన్నారు.

అర్హతలేని వ్యక్తి దగ్గర ఇన్ని రోజులూ ఉన్నానని, ఇకపై తాను దమ్మున్న నేత జగన్ వెంటే ఉంటానని తెలిపారు. తనకు ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తానని అన్నారు. తన అభిప్రాయం మేరకే వైసీపీలో చేరానని తెలిపారు. తన తండ్రి లేఖలను పవన్ పట్టించుకోలేదని అన్నారు.

పవన్‌కి అవసరం వచ్చినప్పుడే హరిరామ జోగయ్య, కాపు సంక్షేమ సేన కావాలనుకుంటారని చెప్పారు. చంద్రబాబు సీఎం అంటే జోగయ్య ఒప్పుకోలేదని అన్నారు. అందుకే జోగయ్యను పవన్ దూరం పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ముఖంలో ఆనందం చూడడానికే ముద్రగడ, జోగయ్యను పవన్ అవమానపరిచారని వ్యాఖ్యానించారు.

Read Also: మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. ఉద్రిక్తత

ట్రెండింగ్ వార్తలు