చిరంజీవిపై పోస్ట్ నేను పెట్టలేదు : చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

  • Publish Date - October 12, 2019 / 07:56 AM IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటికి సంబంధించి తాను అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు.

తన పేరుతో ఎవరో తప్పుగా ప్రచారం చేశారని, ఫేస్‌బుక్‌లో తిరుగుతున్న పోస్ట్‌ నేను పెట్టింది కాదు అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎటువంటి గొడవలు లేవని, చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరుతో వైరల్ అవుతున్న వార్తలను చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు తిరుపతిలో మాట్లాడిన చెవిరెడ్డి.. ఆ పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లు కానీ లేవని వెల్లడించారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు చెవిరెడ్డి.

అప్పటి నుంచి ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు చెవిరెడ్డి.

తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవని చెవిరెడ్డి అన్నారు. అభిమాన సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి మాత్రమే ఉంటాయని, తాను కూడా జగనన్న అభిమానిని అని అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగులను తక్షణమే తొలగించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఆ పోస్ట్‌లో మెగా కుటుంబంపై సెటైర్లు ఉన్నాయి. ”ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అరెస్ట్ అయ్యాడు. చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది” అని వెంటనే కామెంట్ చేశాడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక. వైఎస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి” అంటూ ఆ పోస్టింగ్ లో ఉంది.