Judge Ramakrishna Arrest : జడ్జి రామకృష్ణ పై దేశద్రోహం కేసు.. అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నించాడనే ఆరోపణలతో జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

Chittoor Judge Ramakrishna Arrest, in Sedition case :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేలా ప్రయత్నించాడనే ఆరోపణలతో జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య అనే వ్యక్తి బుధవారం పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్ 124 దేశద్రోహం కింద కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశారు.

రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న రామకృష్ణ  కరోనా పరీక్షల కోసం మదనపల్లి  వెళుతుండగా … పీలేరు ఎన్టీఆర్ కూడలి వద్ద పోలీసులు గురువారం మధ్యాహ్నం గం.12-30 కి అరెస్ట్ చేశారు. ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా .. 14 రోజులు రిమాండ్ విధించారు.  దీంతో జడ్జి రామకృష్ణను పీలేరు సబ్ జైలుకు తరలించారు. జడ్జి రామకృష్ణ ఇటీవలే సస్పెండ్ అయ్యారు.

ఏప్రిల్ 12వ తేదీ రాత్రి గం.9-30 లకు ఓ టీవీ చానల్ వారు అమెరికా మానవ హక్కుల నివేదిక 2020 అనే అంశంపై నిర్వహించిన చర్చావేదికలో రామకృష్ణ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కంసుడిలా తయారయ్యాడని వ్యాఖ్యానిస్తూ…ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.. నేను కృష్ణుడిగా భావించి.. నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను’ అని అన్నారని జయరామచంద్రయ్య తన ఫిర్యాదు లో పేర్కోన్నారు.  ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తాను.. ప్రభుత్వం చేస్తున్న మేలును తలుచుకొని ఫిర్యాదు చేస్తున్నానని జయరామచంద్రయ్య వెల్లడించారు. గతంలోనూ ఆయన్ని తిరుపతిలో ఒకసారి పోలీసులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో రామకృష్ణపై  153, 153ఏ సెక్షన్లు కూడా నమోదు చేశారు.

కాగా…..2018 నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న జగన్ మోహన్ రెడ్డి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడును నడి రోడ్డుపై కాల్చి చంపాలని పిలుపునిచ్చారని పీలేరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  రామకృష్ణ పేర్కోన్నారు. జగన్ వ్యాఖ్యలతో అప్పటి నుంచి తాను మానసికంగా కుంగిపోయానని…. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దయనీయంగా ఉందని.. సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సస్పెండైన జడ్జి రామకృష్ణ నుంచి తమకెలాంటి ఫిర్యాదు అందలేదని  పీలేరు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు