విజయనగరం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…స్వంతంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీసాల గీత

  • Publish Date - December 9, 2020 / 03:58 PM IST

Class differences in Vijayanagaram district TDP : విజయనగరం జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. పార్టీ కార్యాలయం వేదికగా అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత జిల్లా కేంద్రంలో స్వంతంగా వేరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త కార్యాలయం ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు వచ్చారు.



ప్రస్తుతం మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు బంగ్లాలోనే విజయనగరం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే పార్టీ అఫీసు నుంచి సమాచారం రావట్లేదని, అందుకే మరో కార్యాలయం ప్రారంభించాల్సి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అశోక్‌ గజపతి రాజు, గీతల మధ్య విభేదాలు మొదలయ్యాయి.



2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు టిక్కెట్ ఇవ్వకుండా అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుకు టిక్కెట్ ఇచ్చారు. అప్పటి నుంచి మీసాల గీత అశోక్ గజపతిరాజు కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాలు, పార్టీ ఆఫీస్ అశోక్ గజపతిరాజు బంగ్లాలోనే కొనసాగుతోంది. అక్కడికి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇబ్బందవుతున్న ఈ నేపథ్యంలో ఆమె స్వంతంగా మరో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.



పార్టీలో వర్గ విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఎవరికి మద్దతు పలకాలి అన్న దానిపై మీమాంసలో ఉన్నారు.

రెండు వర్గాలు ఏర్పడిన నేపథ్యంలో గీత భవిష్యత్ లో ఏం చేయబోతున్నారు? పార్టీని ముందుకు నడిపిస్తారా లేదంటే వర్గ విభేదాలతో పార్టీ వ్యవహారంతో రచ్చకెక్కి అధిష్టానం దృష్టికి వెళ్లిన నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుదన్నదానిపై ఆసక్తి నెలకొంది.



అశోక్ గజపతిరాజు మొదటి నుంచి కూడా గీతను దూరం పెడుతూ వచ్చేవారు. తిరుగుబావుటా ఎగరవేసిన నేపథ్యంలో గీతకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతూ వచ్చారు. తాను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మీసాల గీత తెలిపారు.