Sanjeevani Project: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచే ‘సంజీవని’ సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని(Sanjeevani Project)' ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
- V Santhosh Kumar
- Published on- August 26, 2026 / 08:47 PM IST
Cm chandra babu naidu orders statewide implementation of sanjeevani project from january 1
- జనవరి 1 నుంచి సంజీవని
- ఏఐ ఆధారిత వైద్యం
- వైద్య ఖర్చుల భారం తగ్గింపు
Sanjeevani Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ‘సంజీవని(Sanjeevani Project)’ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆశాజనకమైన ఫలితాలు వస్తున్న నేపథ్యంలో, దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధం చేసిన 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఏఐ సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు:
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, క్రమబద్ధమైన చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఆరోగ్య డేటా గోప్యత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ప్రజల మొబైల్ ఫోన్‌లకు నేరుగా హెల్త్ అప్‌డేట్స్ పంపేలా నూతన సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. డిజిటల్ విధానం వల్ల రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య భద్రత – కుటుంబ బడ్జెట్‌కు ఊరట:
ఈ పథకం అమలు ద్వారా ప్రతి కుటుంబంపై పడే వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ అమలు చేస్తున్న ఈ అత్యాధునిక సంజీవని మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించేలా ప్రాజెక్టును అత్యంత దిగ్విజయంగా నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు. ముందస్తు నివారణ చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
