AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. పిడుగుపాటు హెచ్చరిక
AP Rain Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
AP Rains
AP Rain Alert : ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ తాజాగా కీలక విషయాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, వర్షాలు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత మూడు, నాలుగు రోజుల్లో ఇది బలపడి దక్షిణ ఒడిస్సా – ఉత్తరాంధ్ర తీరాలవైపు పయనించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
