Ap High Court: బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. స్థానిక పోరుపై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టులో(Ap High Court) కీలక విచారణ ముగిసింది.
Ap high court reserves verdict on 34 percent bc reservations in local body elections
- తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- 34 శాతం రిజర్వేషన్ల సవాలు
- నివేదిక సమర్పణకు ప్రభుత్వ ఆదేశం
Ap High Court: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BC) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల (1065, 105) చట్టబద్ధతపై ఏపీ హైకోర్టులో(Ap High Court) కీలక విచారణ ముగిసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటకూడదని, జీవోలను సవరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం.. రికార్డుల సమర్పణకు ఆదేశం:
విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు గుప్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక ఉత్తర్వులు, ఆ కమిషన్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలను సమర్పించాలని ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లకు కమిషన్ ఏ ప్రాతిపదికన, ఏ గణాంకాలతో సిఫార్సు చేసిందో పూర్తి వివరాలను పరిశీలిస్తామని వెల్లడించింది. అలాగే, గతంలో ప్రణాళికా శాఖ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా నివేదించాలని స్పష్టం చేసింది.
అన్ని వివరాల పరిశీలన తర్వాతే తుది తీర్పు:
సమగ్ర కుటుంబ సర్వేను ఏ ప్రయోజనం కోసం నిర్వహించారో పూర్తి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నివేదికతో పాటు సర్వే గణాంకాలను స్వయంగా పరిశీలించిన తర్వాతే స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ పరిణామంతో స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
