CM Chandrababu: ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. మార్చి నాటికి 5.52 లక్షల ఇండ్లు.. చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం (CM Chandrababu)అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది.
CM Chandrababu ordered officials to distribute 5.52 lakh houses to the poor by this March.
- 2029 నాటికి శాశ్వత ఇళ్లు
- మార్చి నాటికి ఇళ్ల పూర్తి
- పారదర్శకంగా అర్హుల ఎంపిక
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వత గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆరు నెలల్లో, అంటే 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు, కాలపరిమితి!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), పీఎం జన్ మన్ తదితర పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాలను వచ్చే నెలలోనే గ్రౌండింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఇళ్లను నిర్మించడంతో పాటు, డిసెంబర్ 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అలాగే 2027 డిసెంబర్ నాటికి మరో 75 వేల కొత్త ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పురోగతి, పారదర్శక ఎంపిక:
రాష్ట్రంలో పీఎంఏవై 1.0, 2.0, పీఎం జన్ మన్ కింద 18.72 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 13.20 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గానూ 1.88 లక్షల ఇళ్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటి స్థలాలు లేని అర్హులను గుర్తించేందుకు ఆర్టీజీఎస్, ఆవాస్ ప్లస్, రెవెన్యూ శాఖల డేటాను అనుసంధానించి, డూప్లికేషన్ లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
