Women Free Bus Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ పోతోంది. సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించేశారు.
తాజాగా మహానాడు వేదికగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో ఒకటైన.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు తేదీ ఎప్పుడో చెప్పేశారాయన. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఒకటి.
ఉచిత బస్సు పథకం హామీ అమలు దిశగా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో అక్కడ పథకం అమలవుతున్న విధానం తెలుసుకుంది.
Also Read: టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు ఎవరు? ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..
”ఆగస్ట్ 15న మా ఆడబిడ్డలకు శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పాం. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయాన్ని తిరిగి శ్రమించే వాడికి ఖర్చు పెట్టాలి. మళ్లీ అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఇదొక సైకిల్ కింద ప్రజలను శాశ్వతంగా ఎంపవర్ మెంట్ చేసే కార్యక్రమం” అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రభుత్వంపై ఏటా రూ.3,182 కోట్ల మేర భారం పడనుంది. ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్‌లో సున్నా ఉంటుంది. కానీ, ఈ-పోస్ యంత్రంలో మాత్రం టికెట్ ధర నమోదవుతుంది. ఇలా మహిళా ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువను ఆర్టీసీ లెక్కించి, ప్రతి నెల ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది.
అయితే.. ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ, కర్ణాటక తరహాలో రాష్ట్రమంతా వర్తించేలా మహిళలకు అమలు చేస్తారా? లేక జిల్లా పరిధి వరకే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.