cm chandrababu announced triple bedroom house for bigger families and extra pension 60 kg ration
AP Triple Bedroom Houses : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. గత కొన్నాళ్లుగా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి తరచుగా ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి దీనిపై కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు గాను.. సరికొత్త పథకాన్ని ప్రకటించారు. కుటుంబంలో ఐదారుగురు ఉంటే.. అలాంటి వారి కోసం ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. సమాజంలో మారుతున్న కుటుంబ వ్యవస్థ, జనాభా తగ్గుదల వంటి సమస్యల పరిష్కారం కోసం పాపులేషన్ మేనేజ్మెంట్ అనే సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఉమ్మడి కుటుంబాలను కాపాడటం కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు.
అమరావతిలో ఆదివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. మన దేశానికి ఉమ్మడి కుటుంబాలే అతి పెద్ద సంపద అని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే నేటి కాలంలో కేవలం రేషన్, పెన్షన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. ఈ పరిస్థితి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో సమాజంలో… చాలా కుటుంబాల్లో.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారని.. ఇది నిజంగా బాధకరమన్నారు. తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేయాలన్న ఆలోచన మారాలన్నారు.
ఈ క్రమంలో తమ ప్రభుత్వం ఉమ్మడి, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. దీనిలో భాగంగా కుటుంబంలో ఐదారుగురు ఉంటే వారి కోసం ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని.. అలానే ఉమ్మడి కుటుంబాలకు అదనపు పెన్షన్.. కుటుంబంలో 10 మంది వరకు సభ్యులుంటే.. వారికి నెలకు 60 కేజీల వరకు రేషన్ అందించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ప్రకటించారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుంది అన్నారు.
పురుషులకు కూడా ‘మెటర్నిటీ’ సెలవులు
రాష్ట్ర జనాభా ధోరణులపై చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 58 శాతం మంది దంపతులు ఒక్క బిడ్డకే పరిమితమవుతున్నారన్న చంద్రబాబు.. ఈ పరిస్థితి భవిష్యత్తులో జనాభా సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. అందువల్ల జనాభా నియంత్రణ కంటే జనాభా పెంపు మరియు సమర్థవంతమైన నిర్వహణ వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మహిళలతో పాటు ఇద్దరు పిల్లలున్న పురుషులకు కూడా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు (Paternity Leave) ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆధునిక టెక్నాలజీని స్వీకరించడంలో ముందుండే మహిళలు, అదే సమయంలో సంప్రదాయ కుటుంబ విలువలను కూడా కాపాడుకోవాలని ఆయన సూచించారు.
సుపరిపాలన ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తామని చెబుతూ, మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు వివరించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ‘స్వయం’ అనే బ్రాండ్ పేరుతో ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.