CM Chandrababu Naidu
Cm Chandrababu : గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, బియ్యం మాఫియా పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం మాఫియాపై, గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మాఫియా చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు చంద్రబాబు. గత పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్క అధికారి సీరియస్ గా పని చేయాలని చెప్పారు చంద్రబాబు.
రెండు రోజుల కలెక్టర్ల సదస్సు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలు, విజన్ 2047పై వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలల్లోనే పెట్టుబడులపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. ఇక ఇటీవల ఐటీ మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా విశాఖలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. దీంతో విశాఖలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
”కోటీశ్వరులు, కామన్ మ్యాన్ అన్న తేడా లేదు. అందరికీ ఈక్వల్ గా ఓటు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఇవాళ కాపాడుతోంది. కొన్ని దేశాలు కూడా చూశాం. ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో డిక్టేటర్ షిప్ లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. ఆ నియంతలను పంపడానికి విప్లవాలు వస్తుంటాయి. సిరియాలో అదే జరిగింది. అంతకుముందు బంగ్లాదేశ్ లో అదే జరిగింది. ప్రజల్లో రియాక్షన్స్ వచ్చినప్పుడు ఔట్ బరస్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ, భారత దేశంలో మాత్రం రిపీటెడ్ గా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష.
రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా గత పాలనలో అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ, అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే మరింత డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి, నేనెక్కడా కాంప్రమైజ్ కాను. మీరంతా కేర్ ఫుల్ గా ఉండాలి. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరక్కుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగంపై ఉంది. ఆ విషయం మీరంతా నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం” అని చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వ పాలన అందరినీ ఇబ్బంది పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని తప్పులు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్లను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. ‘గత ప్రభుత్వం మా అందరిని చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారులు, రెవెన్యూ యంత్రాంగంతో సినిమా టికెట్లు అమ్మించడం దగ్గరి నుంచి ఇసుక దోపిడీ చేయించడం చేసింది. ఇంత మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించ లేదు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత మంది ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదు. మాకు చాలా ఆవేదన కలిగింది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : మెగా బ్రదర్‌కి మెగా శాఖ దక్కేనా?