Nagababu: మెగా బ్రదర్‌కి మెగా శాఖ దక్కేనా?

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా క్యాబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Nagababu: మెగా బ్రదర్‌కి మెగా శాఖ దక్కేనా?

Nagababu

Updated On : December 11, 2024 / 7:36 AM IST

తమ్ముడికి అన్నగా.. అన్నకి తమ్ముడిగా నిలబడ్డాడు. అన్న పార్టీ పెట్టినా.. తమ్ముడు పార్టీ పెట్టినా వెన్నుదన్నుగా ఉన్నాడు. ఓటమి ఎదురుపడినా అధైర్యపడలేదు. చేయిదాకా వచ్చిన సీట్లు చేజారినా.. నిరుత్సాహపడలేదు. చివరకు ఇప్పుడు ఏపీ క్యాబినెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. నాగబాబుకు మంత్రి పదవి దక్కడం వెనుకు పవన్ ప్రయత్నం ఉందా.. మరి కూటమి ప్రభుత్వం ఏ శాఖ కట్టబెట్టనుంది.

తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబాల్లో ఒకటైన మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం అదృష్టం వరించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా సత్తా చాటుతున్నారు. ఈ సంతోష సమయంలో మరింత గర్వకారణంగా మెగా ఫ్యామిలీకి మరో గుడ్‌న్యూస్ వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబును చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మెగా బ్రదర్ నాగబాబుకు రాజకీయాలేం కొత్తకాదు. మెగాస్టార్ చిరంజీవి గతంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రోజుల్లోనే క్షేత్రస్థాయిలో కేడర్ నడిపి తన ప్రతిభను చూపించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు, నాగబాబును ప్రధాన కార్యదర్శిగా నియమించి, పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకున్నారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు.

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా..
ఐనా నిరుత్సాహపడలేదు. ఫలితాలతో పని లేకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ విజయం కోసం, నాగబాబు ఇంటింటి ప్రచారం చేశారు. రాజకీయాల్లో తమ్ముడి వెన్నంటి నిలిచి, పార్టీ కోసం త్యాగం చేసిన నాగబాబుకు, ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని తెచ్చింది.

ఇదిలా ఉండగా నాగబాబుకు మంత్రి పదవి రావడం వెనుక పవన్ కల్యాణ్‌ పక్కా ప్లాన్ ఉందనిరాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్‌తో కలిసి నాగబాబు కూడా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో నాగబాబుకు అనకాపల్లి ఎంపీ సీటు చివరి దాకా వచ్చి దక్కలేదు. అప్పటికే జరిగిన ఒప్పందాలు – ఒత్తిళ్లు నాగబాబుకు ఎంపీ సీటును దూరం చేశాయి.

ఈ రోజుల్లో పదవుల కోసం జరిగే పోరాటాలు అందరికీ తెలిసిందే. అలాంటిది అందిన ఎంపీ పదవి చేజారిన నాగబాబు చింతించలేదు. తాను అధికార హోదాలు అనుభవించాలన్న కోరిక ఏ కోశానా లేదు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో నాగబాబు కోసం అనేక పదవులు రెడీగా ఉన్నాయని టాక్ అయితే నడిచింది. కాని వాటన్నింటినా ఆయన కొట్టిపారిస్తూ వచ్చారు. కూటమి గెలుపు కోసం నాగబాబు ఎంతో చేశారు కదా ఆయనకు న్యాయం చేయాల్సిందే అన్న చర్చ సాగింది. ఇప్పుడు సడెన్‌గా నాగబాబుకు మంత్రి పదవి అంటూ చంద్రబాబు ప్రకటిచండంతో జనసేన నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఆడపాదడప సినిమాల్లో..
ప్రస్తుతం ఆడపాదడప సినిమాల్లో నటిస్తున్న నాగబాబు.. ఎక్కువ సమయం జనసేన పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటిప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు. నిత్యం కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలకు ఏర్పాట్లను పరిశీలిస్తూ.. నాయకులను సమన్వయం చేస్తూ వస్తున్నారు.

అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. జనసేన పార్టీకీ నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి నాగబాబు శాసనసభలోనూ శాసనమండలిలోనూ మెంబర్ కాదు కదా అంటే దానికీ దారి ఉంది అంటున్నారు. రానున్న ఆరు నెలల కాలంలో మండలిలో చాలా పదవులు ఖాళీ అయ్యే అవకాశముంది. అందులో ఒకటి నాగబాబుకు కన్ ఫర్మ్ అయినట్టే. అయితే దానితో సంబంధం లేకుండా ఈ మధ్యలో ఎపుడైనా నాగబాబు మంత్రి పదవి చేపట్టవచ్చు అని కూడా చెబుతున్నారు.

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా క్యాబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఏపీ క్యాబినెట్‌లో కీలకంగా ఉన్నారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి యూపీఏ హయాంలో కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇలా మెగా బ్రదర్స్ ముగ్గురూ మంత్రి పదవుల్లో కొలుదీరినట్టు కానుంది.

లక్కీ భాస్కర్‌ సినిమా చూసి.. తామూ అలానే సంపాదిస్తామంటూ హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థుల పరారీ