ReNew Energy Global Plant: ఉత్తరాంధ్రకు మణిహారం.. రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ReNew Energy Global Plant: ఈ సంస్థతో అనకాపల్లి అభివృద్ధికి కీలక అడుగు పడింది. 5వేల 400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న రెన్యూ ఎనర్జీ సంస్థ ప్లాంట్ ద్వారా సుమారు 2వేల 100 మందికి ఉపాధి లభించనుంది.
- Naveen
- Updated on- April 23, 2026 / 06:09 PM IST
ReNew Energy Global Plant: రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వం.. మరో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 5వేల 400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న రెన్యూ ఎనర్జీ సంస్థ ప్లాంట్ ద్వారా సుమారు 2వేల 100 మందికి ఉపాధి లభించనుంది.
ఈ సంస్థతో అనకాపల్లి అభివృద్ధికి కీలక అడుగు పడింది. 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ. 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక రచించారు. డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ వేల కోట్ల పెట్టుబడితో 6 గిగా వాట్ల కెపాసిటీ గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతోంది.
Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ శుభవార్త.. జూన్ నెల నుంచి డబ్బులొస్తాయ్..
ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇకపై ఉద్యోగాల కోసం మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇతర ప్రాంతాల వారే ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారని అన్నారు.
”ఉద్యోగాల కోసం మన వాళ్లు ఇకపై హైదరాబాద్ కో, చెన్నై కో పోవాల్సిన అవసరం లేదు. ఒకరోజున వాళ్లు కూడా ఇక్కడికొచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024లో మీరు వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని అడుగుతున్నా.
ఏది విధ్వంసమో, ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి..
నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లెయిన్లతో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లెయిన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూకబ్జాలు. నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరులను సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి.
ఏది విధ్వంసమో, ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి.
ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతి రోజూ పెట్టుబడుల పండుగ జరుగుతోంది. మిట్టల్ స్టీల్ వచ్చింది. ఈ రోజు న్యూ రెన్యూ వచ్చింది. ఈ నెల 28న విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతి పెద్ద సంస్థ ఏఐ డేటా సెంటర్ వస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు జూలై మొదటి వారంలో ఇనాగురేట్ చేస్తున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పరిశ్రమలు వస్తున్నాయి. ఈ జూన్ లో నే వర్షాలు పడితేనే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.
