CM Chandrababu Naidu Pawan Kalyan
Chandrababu Pawan Kalyan: విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏడోరోజు (బధవారం) మూలానక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రాకీలాద్రిపైకి పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే.. సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గాదేవిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. పవన్ కల్యాణ్ ఉదయం 9గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి.. ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. దుర్గమ్మ ఆలయంలో.. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీసరస్వతి దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి నేడు ధన లాభం కలుగును
సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 11.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటలకు దుర్గగుడికి చేరుకొని.. దుర్గాదేవికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇంద్రకీలాద్రికి చంద్రబాబు, పవన్ రానున్న నేపథ్యంలో సాయంత్రం 4గంటల వరకు వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ ప్రత్యేక ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తరువాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వవిద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న దుర్గాదేవిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.