Veligonda Project : వెలిగొండ.. కరవు నేలకు జలకొండ..! కృష్ణమ్మ పరుగులతో 30ఏళ్ల కల సాకారం.. మారనున్న మూడు జిల్లాల రూపురేఖలు
Veligonda Project : ఏపీ గడ్డపైన సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్ ఫేజ్ వన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు.
- Harish Thanniru
- Updated on- August 31, 2026 / 04:39 PM IST
Cm Chandrababu Naidu Inaugurated Phase 1 Of The Veligonda Project In Markapuram District
Veligonda Project : ఏపీ గడ్డపైన సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలు కొత్త జీవం పోసుకోనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల కల సాకారం చేస్తూ.. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్ట్ ఫేజ్ వన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ మహా యజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టి పెరిగిన ఊళ్ళను సైతం త్యాగం చేసిన 11 గ్రామాల వాసుల త్యాగంతో కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణమ్మ పరుగులు తీయనుంది. దీంతో వలస వెళ్ళిన యువతకు ఇక సొంత గడ్డపైనే ఉపాధి కూడా దొరకనుంది.
30ఏళ్ల క్రితం 1996 మార్చి 5న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 1999లో మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చి నిర్మాణ ప్రక్రియకు పునాది వేశారు. ప్రస్తుతం నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు నాయుడు అదే ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విశేషం. వెలుగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కల పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
తీవ్ర వర్షభావంతో అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలు, సాగునీటి కొరతతో దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతానికి వెలుగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే జీవనాధార ప్రాజెక్టు. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి నలమల సాగర్‌లో నిల్వ చేసి ప్రధాన కాలువల ద్వారా సాగు తాగునీటి అవసరాలకు వినియోగించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
59 టీఎంసిల సామర్థ్యం గల వెలుగొండ ప్రాజెక్టు రెండు దశల్లో నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం తొలి దశ నిర్మాణం పూర్తికావడంతో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తొలి దశలో భాగంగా 10.70టీఎంసీల కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు విడుదల కానున్నాయి. మొదటి విడతలో సుమారు 1.19లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షల జనాభాకు తాగునీరు అందనుంది. రెండో దశ పూర్తి అయితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సుమారు 23 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం చేకోరునుంది. వెలుగొండ ప్రాజెక్టుతో కరువు ప్రాంతంలో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియలో ఎన్నో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్‌గా తీసుకొని పనులను వేగవంతం చేసింది. టన్నెల్ పనులు, ఫీడర్ కాలువలు, హెడ్ రెగ్యులేటర్లు ఇతర అనుబంధ నిర్మాణాలతో పాటు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం పరిహారం చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలో నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం చెల్లించింది. అంతేకాకుండా గెజిట్ జాబితాలో పేర్లు లేని వారి కోసం మరో 169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది. 30ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు సహకారం కావడంతో నాలుగు జిల్లాల్లో ముఖ్యంగా మార్కాపురం ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
