Cm Chandrababu Naidu : రాయలసీమకు చంద్రబాబు సరికొత్త నిర్వచనం.. జగన్‌పై సెటైర్లు.. స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం
CM Chandrababu Naidu : కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగారం పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
- Harish Thanniru
- Published on- July 3, 2026 / 06:58 PM IST
CM Chandrababu Naidu
- రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం
- రాయలసీమకు సీఎం చంద్రబాబు సరికొత్త నిర్వచనం
- రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్ జగన్‌పై సెటైర్లు
CM Chandrababu Naidu : రాయలసీమను దేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారీ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధితో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. రాయలసీమ వాసులు దశాబ్దాలుగా కలలు కంటున్న ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ అంటే కరువు కాదని.. హార్టికల్చర్ హబ్ గా అభివర్ణించిన చంద్రబాబు.. స్వర్ణగిరి గోల్డ్‌ఫీల్డ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు కేరాఫ్ అడ్రస్ రాయలసీమ అన్నారు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, కియా కార్లు, ఖనిజాలు, ఇలా.. రాయలసీమ స్వర్ణ యుగం దిశగా అడుగులు వేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీలో ఇప్పటి వరకు సుమారు రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, వాటి ద్వారా దాదాపు 20లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రూ.11.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, వీటి ద్వారా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించనున్నట్లు చెప్పారు. కడప జిల్లాలో సుమారు 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కలిగిన స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటవుతోందని, ఇందుకోసం దాదాపు రూ.36వేల కోట్ల పెట్టుబడి వస్తోందని సీఎం వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామమని పేర్కొన్నారు.
ప్రత్యేకించి రాయలసీమలో భారీ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీతో పాటు రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక ఉత్పత్తి కేంద్రాలను కూడా రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఐదో తరం ఫైటర్ జెట్ల తయారీ కూడా ఈ ప్రాంతంలో జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికే రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు.
రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతిని అంతం చేశామని, కానీ, నేరాలు చేసేవాళ్లు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరం అన్నారు. విధ్వంసమే అజెండాగా పెట్టుకున్న ఒక వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయగలరు. 2014లో అమరావతి రాజధానిగా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ నవ్వులపాలు చేశారు. మళ్లీ మొన్న మావిగన్ అంటే.. నేడు విజయవాడ అంటూ మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారు. రేపు ఇంకేమంటారో తెలియని పరిస్థితి అంటూ వైఎస్ జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు.
