AP Telangana Weather Update : ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. ఐఎండీ కీలక అప్డేట్.. హెచ్చరికలు జారీ
AP Telangana Weather Update : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
AP Telangana Weather Update
- తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు
- భారీగా ఈదురుగాలులు, పిడుగులు పడే చాన్స్
- అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచన
AP Telangana Weather Update : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వరుణుడు ముఖంచాటేశాడు. దీంతో రైతులతోపాటు ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు (ఆదివారం) పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, పిడుగులు, ఈదురుగాలుల పట్ల ప్రజలు, రైతులు అప్రమ్తతంగా ఉండాలని సూచించింది.
Also Read : Heavy Rain Alert: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం సాధారణంగానే ఉన్నందున రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలు ఏవీ జారీ చేయలేదు. అయినప్పటికీ వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ప్రస్తుతం వాతావరణ సమాచారం బట్టి ఏపీపై దీని ప్రభావం తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. అయితే, తాజా వాతావరణ పరిస్థితుల ప్రకారం.. ఇవాళ (ఆదివారం) ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో పెద్దగా వర్షాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పిడుగులతోపాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అయితే, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
