తల్లికి వందనం డబ్బులు రూ.15వేలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడిస్తారో చెప్పేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
- Harishth Thanniru
- Published On : May 18, 2025 / 02:59 PM IST
Thalliki Vandanam
Thalliki Vandanam: ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకాన్ని పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా.. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
మే17న కర్నూలులో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. జూన్ నెలలో పాఠశాలలు తెరిచేలోపు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించినట్లయింది. సీఎం చంద్రబాబే స్వయంగా జూన్ లో పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీతో సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు ఈ పథకం ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. అంటే ఇంటర్ వరకూ చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున డబ్బులను వారి తల్లుల బ్యాంక్ అంకౌట్లలో జమ అవుతుంది.
తల్లికి వందనం పథకం అమలు కోసం 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వం.. రూ. 9407 కోట్లు కేటాయింపులు చేసింది. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో సుమారు 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ తేల్చింది. తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే.. విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుంది అధికారులు అంటున్నారు.. వారికే దీన్ని వర్తింపజేయనున్నారని సమాచారం. అయితే, ఈ పథకం అమలు నాటికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
