AP Gogvt : ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం.. ఒక్కో కుటుంబానికి రూ.25వేలు..
Nethanna Sevalo Scheme 2026 : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు చేనేత కార్మికుల కుటుంబాలకు నేతన్న సేవలో పథకం ప్రారంభంకానుంది.
- Harish Thanniru
- Updated on- August 7, 2026 / 07:47 AM IST
Nethanna Sevalo Scheme 2026
Nethanna Sevalo Scheme 2026 : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి చర్యలు చేపడుతోంది. నూతన పథకాలతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా.. ఏపీ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు పథకంకు సంబంధించి నిధులు విడుదల చేయనున్నారు.
Also Read : AP Rains : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ
ఏపీలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ చేనేత కార్మికుల కుటుంబాలకు నేతన్న సేవలో పథకం ప్రారంభంకానుంది. సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఈ పథకాన్ని ప్రారంభించి ఒక్కొక్కరికి రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఈసాయం అందిస్తున్నారు.
నేతన్న సేవలో పథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా 71,536మంది చేనేత కార్మికుల కుటుంబాల ఖాతాల్లో రూ.179 కోట్లు బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. చేనేతలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
చేనేతలకు ప్రతీనెల 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీనికోసం ఏడాదికి రూ.150కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉచిత విద్యుత్ పథకంలో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ కుటుంబాలకు మేలు జరుగుతోంది. క్యాష్ క్రెడిట్ ద్వారా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్లు అందించారు.
సీఎం పర్యటన ఇలా..
సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.30కు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 10.50కి చీరాల కొత్తపేటలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుని 12.35 వరకు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 1.20కు జాండ్రపేట వచ్చి మగ్గాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడతారు. 2.15కు అక్కడి నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 4.25కు చీరాల కొత్తపేట నుంచి బయలుదేరి 4.45కు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
