రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులను వదల.. సత్తెనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్

డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదు. డబ్బుతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది. అభివృద్ధి, ఆదర్శంతో రాజకీయాలు చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

CM Chandrababu: డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదు. డబ్బుతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది. అభివృద్ధి, ఆదర్శంతో రాజకీయాలు చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు.

 

2019లో అధికారంలోకి వచ్చిఉంటే..
బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఎప్పుడూ చేయం. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాలి. అదే మన లక్ష్యం అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. సుస్థిరపాలన ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. యూపీలో కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటు తనం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. 11ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. అందుకే దేశం అభివృద్ధి చెందుతుంది. 2019 ఎన్నికల్లో మనమే గెలిచి ఉంటే ఏపీ అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని చంద్రబాబు అన్నారు.

డబ్బులతో కాదు.. అభివృద్ధితోనే..
డబ్బులతో గెలుపు సాధ్యం కాదు. ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినవాళ్లకి కేవలం 11 సీట్లే వచ్చాయి. డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం స్పష్టమైంది. అభివృద్ధితో ఆదర్శంతో రాజకీయాలు చేద్దాం. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందుకాదు.. నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి. ఎన్నికల ముందు మాట్లాడితే.. ఓట్ల కోసం మాట్లాడారని అంటారు. గత ప్రభుత్వం తెచ్చిన బ్యాడ్ ఇమేజ్ పోగొట్టాలంటే చాలా సమయం పడుతుంది. కానీ, టీడీపీకి ఉన్న బ్రాండ్ తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.

సత్తెనపల్లి ఘటనపై..
కూటమి ప్రభుత్వంలో నేరస్తులను నేరస్థులుగానే చూస్తాం. తప్పులు చేసిన వారు ప్రత్యర్థి పార్టీలో ఉంటే అరెస్ట్ చేయకూడదా..? చర్యలు తీసుకోకూడదా..? సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని కాపాడి ఆస్పత్రికి పంపుతాం. కానీ, తన కారు కిందే కార్యకర్త పడిపోతే పక్కకు పడేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తరువాతకూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తారా..? అంటూ వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ల వద్దకు వెళ్తారా..? ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతోపాటు.. మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలి అంటూ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

మళ్లీ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారు..
వివేకా హత్యను ఎలా ఏమార్చారో ప్రజలకు వివరించాలి. వివేకా హత్య విషయంలో ప్రజలే కాదు.. నన్నూ ఏమార్చారు. ఆనాడే వివేకా హంతకులను పట్టుకుని ఉంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లం కాదు. ఎన్నికల హడావుడి పక్కన పెట్టి 2గంటలు వివేకా హత్యపై శ్రద్దపెట్టి రికార్డులు సీజ్ చేసిఉంటే 2019లో మనమే గెలిచేవాళ్లం. మళ్లీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు తెరలేపుతున్నారంటూ చంద్రబాబు అన్నారు.