Chandrababu Naidu
Chandrababu Naidu : విశాఖపట్టణంలో ఈనెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఈసారి సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరగనుందని పేర్కొన్నారు. ఇందులో ప్రజంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యుషన్ ఒప్పందాలు జరుగుతాయని అన్నారు.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ స్థాయిలో ఇక్కడా భారీ ఈవెంట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో భారీ ఈవెంట్లను ప్రోత్సహిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. థమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రస్తుతం జరుగుతున్న ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటివి అమరావతికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఓ వైపు భారీ ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు 6వేల కోట్ల పెట్టుబడి పెడుతుండటం శుభపరిణామం అని చంద్రబాబు పేర్కొన్నారు.
పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేశ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. పిషమెంటే మిగిలింది. గడువులోపే ఇది అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
పార్టీ కమిటీలు వీలైనన్ని నెలాఖరులోగా పూర్తి చేస్తామని, పార్లమెంట్ కమిటీల మీద కసరత్తు ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి అన్ని కమిటీలు పూర్తి చేసి పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందేనని.. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థ ఏర్పాటే మా లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.